Charu Pandey Success Story: కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?

23 ఏళ్ల వయసులోనే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించిన చారు పాండే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. SSC, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్‌ తదితర పరీక్షల్లో అర్హత సాధించిన ఆమెకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌ అందనున్నది. ఆమె విజయగాథ ప్రస్తుతం లక్షలాది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది..

Charu Pandey Success Story: కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
Charu Pandey Inspirational Success Story

Updated on: Jun 12, 2026 | 5:38 PM

దృఢ సంకల్పం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించింది నిండా పాతికేళ్లు కూడా నిండని ఓ యువతి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే గగనమై పోతున్న నేటి కాలంలో ఏకంగా 19 సర్కార్ కొలువులు దక్కించుకుంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చారు పాండే. చిన్న గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగిన ఈ 23 ఏళ్ల యువతి ఏకంగా 19 పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది.

ఎవరీ చారు పాండే?

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా టిల్డా-నెవోరాకు చెందిన చారు పాండే తన పాఠశాల విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేసింది. అనంతరం హేమ్‌చంద్ యాదవ్ యూనివర్సిటీలో గణిత శాస్త్రంలో బీఎస్సీ చదివింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవడం ప్రారంభించింది.

19 పోటీ పరీక్షల్లో విజయం

క్రమబద్ధమైన ప్రణాళిక, కఠినమైన అధ్యయనంతో చారు అనేక ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విజయాన్ని అందుకుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే SSC CGL, SSC CHSL, SSC MTS, SSC GD, SSC CPO పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో నిర్వహించే IBPS PO, IBPS Clerk, SBI PO, SBI Clerk పరీక్షలను కూడా విజయవంతంగా క్లియర్ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించే NTPC, గ్రూప్-డి పరీక్షల్లోనూ అర్హత సాధించింది. ఇవే కాకుండా ఢిల్లీ పోలీస్, ఛత్తీస్‌గఢ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్, ట్రాన్స్‌పోర్ట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లోనూ విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్ నేషనల్ హెల్త్ మిషన్ (CG NHM) సహా పలు నియామక పరీక్షల్లో కూడా అర్హత సాధించింది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్

చారు పాండే సాధించిన అసాధారణ విజయాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమెను గోల్డ్ మెడల్‌తో సత్కరించనుంది. ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనుంది.

ప్రస్తుతం ఏ ఉద్యోగంలో?

ప్రస్తుతం చారు పాండే.. చెన్నైలోని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె విజయగాథ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ఎంతో స్ఫూర్తివంతంగా మారింది. చారు విజయ ప్రయాణం అంత సులభం కాదు. ప్రారంభ దశలో అనేక పరీక్షల్లో విఫలమైంది. అయితే నిరాశ చెందకుండా తన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంది. అపజయాలను ఓటమిగా కాకుండా నేర్చుకునే అవకాశాలుగా భావించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె చెబుతోంది.

విజయ రహస్యం ఇదే

చారు తన విజయానికి ప్రధాన కారణంగా క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక అని చెబుతుంది. సబ్జెక్ట్‌వారీగా చదవడం, క్రమం తప్పకుండా మాక్ టెస్టులు రాయడం, ప్రతి పరీక్ష తర్వాత చేసిన తప్పులను విశ్లేషించడం తన విజయానికి దోహదపడ్డాయని వెల్లడించింది. స్పష్టమైన లక్ష్యం, టైం మేనేజ్‌మెంట్, నిరంతర సాధన ఉంటే ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించవచ్చని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం లక్షలాది మంది యువతకు చారు పాండే స్ఫూర్తిదాయకమైన విజయగాథ ఆదర్శంగా నిలిచింది.

Follow Us