జూన్ 1న తెరచుకోని CBSE రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ విండో.. విద్యార్ధుల గుండెల్లో గుబులు

సీబీఎస్ఈ రీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 1న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పోర్టల్ అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే సాంకేతిక, చెల్లింపుల వ్యవస్థలకు సంబంధించిన తుది పనులు పూర్తవుతున్నాయని, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ వర్గాలు తెలిపాయి..

జూన్ 1న తెరచుకోని CBSE రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ విండో.. విద్యార్ధుల గుండెల్లో గుబులు
CBSE Re-evaluation process delayed

Updated on: Jun 01, 2026 | 3:26 PM

న్యూఢిల్లీ, జూన్‌ 1: సీబీఎస్ఈ (CBSE) రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తుల ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు ప్రకటించినప్పటికీ.. ఆదివారం ఉదయం వరకు ఆన్‌లైన్ దరఖాస్తు విండో అందుబాటులోకి రాలేదు. అధికారిక సీబీఎస్ఈ పోర్టల్‌లో ఇప్పటికీ ‘అండర్ మెయింటెనెన్స్’ అనే కనిపించడంతో వేలాది మంది విద్యార్థులు దీనికోసం నిరీక్షిస్తున్నారు. అయితే సీబీఎస్ఈ వర్గాల సమాచారం ప్రకారం రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్ సోమవారం రోజునే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం సాంకేతిక పనులు, చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన తుది ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే విద్యార్థుల కోసం పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

గతంలో రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియను వాయిదా వేసిన సీబీఎస్ఈ, విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా సజావుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దరఖాస్తుల సమయంలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ప్రస్తుతం పోర్టల్ పనితీరు, పేమెంట్ ఇంటిగ్రేషన్‌కు సంబంధించిన తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే సీబీఎస్సీ పోర్టల్‌ విండో తెరచుకోవడంలో ఆలస్యం నెలకొనడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ (JEE) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రీ-ఎవాల్యుయేషన్ ద్వారా మార్కులు మెరుగుపడితే ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు అవసరమైన 75 శాతం అర్హతను సాధించేందుకు అవకాశం ఉంటుంది.

పరీక్ష ఫలితాలు, అర్హత నిబంధనలు, కౌన్సెలింగ్ గడువుల మధ్య ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ జాప్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇకపై ఆలస్యం చేయకుండా పోర్టల్‌ను ప్రారంభించి స్పష్టమైన సమాచారం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. సీబీఎస్ఈ త్వరగా పోర్టల్‌ను పునరుద్ధరించి స్పష్టమైన సమాచారం అందించాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించిన సీబీఎస్సీ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బోర్డు వెబ్‌సైట్‌లో ప్రకటించిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సీబీఎస్ఈ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us