
హైదరాబాద్, డిసెంబర్ 25: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐఎంలు, మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. క్యాట్ ఫలితాల్లో మొత్తం 12 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా వంద శాతం స్కోర్ సాధించ లేకపోవడం గమనార్హం. గత ఏడాది 100 పర్సంటైల్ స్కోర్ పొందిన 14 మందిలో తెలంగాణ విద్యార్థులు ఇద్దరు, ఏపీ అభ్యర్థి ఒకరు చోటు దక్కించుకున్నారు. 100 పర్సంటైల్ సాధించిన 12 మందిలో ఇద్దరు అమ్మాయిలున్నారు. అలాగే ఈ 12 మందిలో ఏకంగా 9 మంది ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేనివారే కావడం విశేషం. టాపర్లలో ముగ్గురు మాత్రమే ఇంజినీరింగ్ అభ్యర్ధులు ఉన్నారు. గతానికి భిన్నంగా ఈసారి నాన్ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఎక్కువ మంది టాపర్లుగా నిలవడం విశేషం. ఆ తర్వాత ర్యాంకుల్లో అంటే 99.99 పర్సంటైల్ సాధించిన వారు 26 మంది ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు మాత్రమే ర్యాంకు సాధించారు.
కాగా ఈ ఏడాది నవంబరు 30వ తేదీన క్యాట్ 2025 పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిదే. ఈ పరీక్ష ఫలితాలను ఐఐఎం కోజికోడ్ తాజాగా విడుదల చేసింది. మొత్తం 2.95 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2.58 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 97 వేల మంది అమ్మాయిలు, 1.61 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు. టాపర్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. క్యాట్ స్కోర్ ఆధారంగా ఆయా ఐఐఎంలు ఇంటర్వ్యూ నిర్వహించి సీట్లు కేటాయిస్తాయి. 96 ఆపై పర్సంటైల్ వచ్చిన వారికి ఓపెన్ కేటగిరీలో అంటే రిజర్వేషన్ లేకున్నా ఐఐఎంల్లో సీటు కేటాయించనున్నారు. రిజర్వేషన్ ఉన్న వారికి 90కిపైగా పర్సంటైల్ దక్కినవారికే సీట్లు కేటాయించనున్నారు. మొత్తం 22 ఐఐఎంలతోపాటు దేశ వ్యాప్తంగా 93 ఇతర విద్యా సంస్థలు క్యాట్ స్కోర్ ఆధారంగా సీట్లను కేటాయిస్తాయి.
క్యాట్ 2026 స్కోర్ కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.