Telangana SI Exam: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరుస ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పోలీసు ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సైతో పాటు, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా ఆగస్టు 7న ఎస్సై రాత పరీక్షా, 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగస్టు 7న జరగాల్సిన పరీక్షను మరో తేదీకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అదే రోజున యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్, ఐబీపీఎస్ ఆర్ఆర్ఆ ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నందుకు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీస్ ఉన్నతాధికారులను కలిసిన అభ్యర్థులు పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని విన్నవించుకున్నారు. మరి అభ్యర్థుల ప్రతిపాదననను అధికారులు పరిగణలోకి తీసుకొని పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తారో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే ఎస్సై పరీక్షకు అప్లికేషన్స్ స్వీకరణ పూర్తికాగా అభ్యర్థులు జులై 30 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17,291 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఎస్సై పోస్టులకు 2.45లక్షల మంది, కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..