పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులవుతున్న వారిలో ఎక్కువ మంది 90 శాతానికి పైగా మార్కులు సాధిస్తుండటం విశేషం. ముఖ్యంగా సీబీఎస్‌ఈతో పోలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల్లో 90, 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న విద్యార్థుల శాతం అధికంగా ఉన్నట్లు మార్చి పబ్లిక్‌ పరీక్షల గణాంకాలు సూచిస్తున్నాయి..

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
Why Are More Students Scoring Above 90 percent in AP

Updated on: Sep 01, 2026 | 7:11 PM

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ మార్చి పబ్లిక్‌ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతం (570 మార్కులు)కుపైగా సాధించిన విద్యార్థులు 7.92 శాతం ఉన్నారు. అదే సీబీఎస్‌ఈలో ఈ స్థాయి మార్కులు సాధించిన వారు కేవలం 2.39 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సీబీఎస్‌ఈతో పోలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న విద్యార్థుల శాతం మూడింతలకు పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 90 శాతం (540 మార్కులు)కుపైగా సాధించిన వారి శాతంలోనూ గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు 20.68 శాతం కాగా, సీబీఎస్‌ఈలో ఈ సంఖ్య 9.57 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు మొత్తం 6,18,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 5,26,954 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 85.25గా నమోదైంది. మరోవైపు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది 24,71,777 మంది హాజరుకాగా, ఇందులో 23,16,008 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి భాషా సబ్జెక్టుల్లోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు సబ్జెక్టులో 1,98,835 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 1,86,298 మంది (30 శాతం) విద్యార్థులు 91-100 మార్కుల మధ్య సాధించారు. 1,16,779 మంది (19 శాతం) 81-90 మార్కులు పొందారు. హిందీలోనూ ఇదే పరిస్థితి. హిందీ సబ్జెక్టులో 1,11,443 మంది (18.36 శాతం) విద్యార్థులు 91-100 మార్కులు సాధించారు. మరో 1,03,332 మంది (17.02 శాతం) 81-90 మార్కులు పొందారు. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 45 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించారు. 91-99 మార్కులు సాధించిన వారు 74,834 మంది కాగా, 81-90 మార్కులు సాధించిన విద్యార్థులు 1,63,102 మంది ఉన్నారు.

మూల్యాంకన విధానంపై విమర్శలు

ఒకవైపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు విద్యార్థుల వాస్తవ అభ్యసన సామర్థ్యాలపై పలు సర్వేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏఎస్ఈఆర్‌ (ASER) వంటి సర్వేల్లో విద్యార్థుల చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని వెల్లడైన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన బేసిక్‌ సర్వేల్లోనూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. దీంతో పబ్లిక్‌ పరీక్షల్లో వస్తున్న అత్యధిక మార్కులు, విద్యార్థుల వాస్తవ విద్యా సామర్థ్యాలకు ఎంతవరకు ప్రతిబింబంగా ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో అధిక మార్కులు రావడానికి ప్రశ్నపత్రాల స్థాయి, మూల్యాంకన విధానం కూడా కారణమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 70 శాతానికిపైగా ప్రశ్నలు మోడల్‌ పేపర్లు, ప్రీ-ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల నుంచే ఉంటున్నాయి. దీంతో విద్యార్థుల అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

భాషా దోషాలపై మార్కులు తగ్గించడం లేదా?

భాషా సబ్జెక్టుల్లో విద్యార్థుల చేతిరాత, భాషా వినియోగం, వ్యాకరణం, భాషా దోషాలు, కంటెంట్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని మూల్యాంకనంలో కచ్చితంగా అమలు చేయడం లేదు. కంటెంట్‌, భాషా దోషాలకు విడివిడిగా మార్కులు కేటాయించినప్పటికీ, సమాధానాల్లోని తప్పులకు తగిన విధంగా మార్కులు తగ్గించడం లేదు. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం సానుకూల అంశంగానే కనిపించినప్పటికీ, ఆ మార్కులు విద్యార్థుల వాస్తవ అభ్యసన స్థాయిని ప్రతిబింబిస్తున్నాయా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రశ్నపత్రాల స్థాయి, మూల్యాంకన ప్రమాణాలు, విద్యార్థుల ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను సమగ్రంగా పరిశీలిస్తేనే విద్యా ప్రమాణాలపై స్పష్టమైన అంచనాకు రావచ్చని వారు పేర్కొంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us