
అమరావతి, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాల కలెక్టర్లు ‘మిషన్ మార్చి’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల భవనాల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
2027 డిసెంబరు నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నారా లోకేశ్ తెలిపారు. అక్షరాస్యతతో పాటు విద్యార్థుల్లో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘నైపుణ్యం’ పోర్టల్‌ను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. నో బ్యాగ్ డే సందర్భంగా పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు జీవితంలో ఉపయోగపడే అంశాలను బోధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుటుంబ ఆదాయం-వ్యయాల నిర్వహణ వంటి అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా ఒకరోజు ‘సంజీవని’ కార్యక్రమం నిర్వహిస్తున్న తరహాలోనే ‘నైపుణ్యం డ్రైవ్’ను కూడా చేపట్టాలని భావిస్తున్నామని నారా లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు భవిష్యత్తు జీవితానికి అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక అవగాహన, డిజిటల్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.