AP DSC 2024 Postponed: ‘ఎన్నికల ‘కోడ్‌’ ముగిశాకే టెట్‌ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ’ విద్యాశాఖ స్పష్టం

|

Apr 01, 2024 | 2:38 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడినట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహించబోమని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటు టెట్‌ ఫలితాలకు కూడా బ్రేక్‌ పడింది. డీఎస్సీ నిర్వహణపై అనుమతి కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌..

AP DSC 2024 Postponed: ఎన్నికల ‘కోడ్‌’ ముగిశాకే టెట్‌ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ విద్యాశాఖ స్పష్టం
AP DSC 2024 Postponed
Follow us on

అమరావతి, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడినట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహించబోమని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటు టెట్‌ ఫలితాలకు కూడా బ్రేక్‌ పడింది. డీఎస్సీ నిర్వహణపై అనుమతి కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. తాజాగా అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతే ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలు విడుదల చేయాలని, డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఎన్నికల నియమావళి కారణంగా డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది.

కాగా 2019లో జగన్‌ సర్కార్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఈ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఇప్పుడు ఎన్నికల ముందు హడావిడిగా 6,100 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎన్నికల వల్ల డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ చేసిన మేలేంటని విపక్షలు విమర్శనాస్త్రాలు విసురుతున్నాయి. రాజకీయాల సంగతి పక్కనపెడితే.. పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ గత కొంతకాలంగా నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్‌ నెరవేరినట్లైంది.

ఇక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి పలు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసిన వారిని అనుమతించడంపై అభ్యర్ధులు కోర్టు కెక్కారు. బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదని జనవరి 26న జీవో 4ను ప్రవీణ్‌ప్రకాష్‌ జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అనర్హులంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో వెనక్కి తగ్గిన విద్యాశాఖ ఎస్‌జీటీ పోస్టులను డీఎడ్‌ చేసిన వారికే పరిమితం చేసింది. హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు పొడిగించింది. ఆ తర్వాత అభ్యర్థులకు సన్నద్ధత సమయం ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఒకసారి డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. దీంతో మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో పరీక్ష జరుగుతుందో లేదోనన్న ఆందోళనలో ఇన్నాళ్లు నిరుద్యోగులు గందరోళపడ్డారు. ఇక శనివారం (మార్చి 30) కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున కోడ్ ముగిశాకే టెట్‌ ఫలితాలు వెల్లడిస్తామని, అప్పటి వరకూ డీఎస్సీ పరీక్ష నిర్వహించబోమని విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగులు సన్నద్ధతకు మరింత సమయం దొరికినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.