అమరావతి, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ జులై-2024) పరీక్షల తుది ఆన్సర్ ‘కీ’ ఈ రోజు విడుదలకానుంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్‌లో పేర్కొంది. పరీక్షల ఫైనల్ కీ అక్టోబర్ 27వ తేదీన విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఆదివారం ఏ క్షణంలోనేనైనా టెట్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదలకానుంది. తుది ఆన్సర్ కీ ప్రకటించిన అనంతరం నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే టెట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీతోపాటు క్వశ్చన్ పేపర్లను విడుదలచేసిన విద్యాశాఖ.. సమాధానాలపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. ఆయా ప్రశ్నలను పరిశీలించి తుది అన్సర్ కీని సిద్ధపరిచారు. ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీన ఫైనల్ కీ విడుదలకానుంది.
కాగా టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 17 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్‌కు మొత్తం 4,27,300 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 86.28 శాతం మంది పరీక్షలు రాశారన్నమాట. ఆయా తేదీల్లో రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు.
ఏపీ ‘టెట్’ ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నవంబర్ 2వ తేదీన షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు ప్రకటిస్తే.. ఆ మరుసటి రోజే ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం… నవంబరు మొదటివారంలో ఉద్యోగ ప్రకటన ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఎలాంటి న్యాయ పరమైన చిక్కులకు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. మెగా డీఎస్సీ మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీలు) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీలు) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీలు) పోస్టులు 132 వరకు ఉన్నాయి.