అమరావతి, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ముగిసిన పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌లను విద్యాశాఖ వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తుంది. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రశ్నాపత్రం, ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
అభ్యంతరాల స్వీకరణ కూడా మొదలైంది. ఏదైనా ప్రశ్నపై అభ్యంతరాలు లేవనెత్తే అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో తెలపవచ్చు. పేపర్ 2ఎ (మ్యాథ్స్ అండ్ సైన్స్) పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. ఇక అక్టోబర్ 21న టెట్ పరీక్షలు ముగిశాక వెనువెంటనే మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అభ్యంతరాలు స్వీకరణ అనంతరం అక్టోబర్ 27న తుది ఆన్సర్ ‘కీ’ విడుదల చేసి తుది ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత రోజే అంటే నవంబర్ 3వ తేదీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 (జులై) ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 (జులై) రెస్పాన్స్ షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగాలు మానివేసి మరీ సీరియస్ గా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైతే ప్రిపరేషన్ కు విద్యాశాఖ 3 నెలలు గడువు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకారంగా చూస్తే డీఎస్సీ పరీక్షలు జవవరిలో ఉండే అవకాశం ఉంది.