
అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 1 నుంచి మొదలయ్యే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) హాల్ టికెట్లను శనివారం జనవరి 24 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు (సీనియర్ ఇంటర్) బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల 2026 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలోనే నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అన్ని జూనియర్ కాలేజీలను ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్ జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. ప్రాక్టికల్స్‌లో అవకతవకల కట్టడికి ఈ మేరకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. కాగా ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.