
అమరావతి, ఏప్రిల్ 9: ఈసారి పదో తరగతి మూల్యాంకనంలో మార్కుల నమోదుకు ఆటోమేషన్ పేరిట ఈ ఏడాది ట్యాబ్ లను వినియోగించాలని విద్యాశాఖ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఇందుకోసం రూ.50 లక్షలతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. అయితే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్‌లో ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం మొదలైన టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ట్యాబ్‌లు మొరాయించడంతో రాత్రి 10 గంటల వరకు సాగింది. సాంకేతిక లోపం, నెట్ వర్క్ పనిచేయకపోవడం, సర్వర్ డౌన్, ట్యాబ్‌లు సజావుగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక కారణాలతో మార్కుల నమోదులో తీవ్ర జాప్యం నెలకొంది.
దీంతో సోమవారం ఒక్కో ఉపాధ్యాయుడు కేవలం 20 జవాబు పత్రాలే మూల్యాంకనం చేశారు. అనంతరం వాటిని స్కాన్ చేసి, ట్యాబ్‌లో నమోదు చేసేందుకు యత్నిస్తే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. రాత్రి 10 గంటల వరకు కుస్తీపడిన టీచర్లు సోమవారం మిగిలిన మార్కుల నమోదు ప్రక్రియను మంగళవారం మధ్యాహ్నానికి పూర్తి చేశారు. విధుల్లో పాల్గొనే టీచర్లు ఒక్కోక్కరు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రతి జవాబు పత్రాన్ని స్కానింగ్ చేసి, మార్కులు నమోదు చేయాలి. అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు మూల్యాంకనం చేసిన అనంతరం మార్కులను ట్యాబ్‌ల ప్రక్రియకు ప్రత్యేకంగా కేటాయించిన స్పెషల్ అసిస్టెంట్లు మాత్రమే నమోదు చేయాలి. దీంతో మరో స్పెషల్ అసిస్టెంట్ చేయాలని ప్రయత్నించినా, అందుకు సాఫ్ట్‌వేర్ అనుమతించదు. వాల్యూయేషన్ సెంటర్లలో అందుబాటులో ఉంచిన ట్యాబ్‌లు, ఇంటర్నెట్ పనిచేయడం లేదని టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మూల్యాంకనం సాయంత్రం 4 గంటలకల్లా పూర్తవ్వాలి. కానీ సాంకేతిక సమస్యలతో అర్ధరాత్రి 11 గంటలు దాటినా మార్కుల నమోదు పూర్తికావడం లేదు. దీంతో ఉపాధ్యాయులు దిద్దిన జవాబు పత్రాలను తిరిగి స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్నారు.
కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగాయి. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. సోమవారం నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనం పది రోజుల్లోపు అంటే ఏప్రిల్ 16లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకనం విధులకు దాదాపు 20 వేల మందిని ఆటోమేషన్ ద్వారా నియమించారు. అయితే విద్యాశాఖ నుంచి చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్ విధులు కేటాయించినా కొందరు ఎగ్జామినర్లు డుమ్మాకొడుతున్నారు. దీంతో టీచర్ల కొరత ఏర్పడి మూల్యాంకనం ప్రక్రియ విద్యాశాఖ అధికారులకు గుదిబండగా మారింది. స్పాట్‌లో టీచర్ల కొరత తీవ్రతరం కావడం విద్యాశాఖ స్పందించింది. స్పాట్ విధులకు హాజరుకాని టీచర్లపై సస్పెన్షన్ వేటు తప్పదని అధికారులు హెచ్చరించారు. స్పాట్ సెంటర్‌లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను టెలికం అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తొలుత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.