Work From Home Survey: కరోనా పాండమిక్ ప్రారంభిమైనప్పటి నుంచి చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. గత ఏడాది మార్చి నెల రెండో వారం నుంచే భారత్‌లో పలు కంపెనీల్లో వర్క్ ఫ్రం హోమ్ మొదలయ్యింది. ఇక ఆఫీస్‌లకు వెళ్లొచ్చని అనుకుంటున్న వేళ సెకండ్ వేవ్ మొదలుకావడంతో వారు ఏడాదికి పైగా తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల మనోగతంపై నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తాము ఆఫీస్‌లకు వెళ్లి పనిచేయాలనుకుంటున్నట్లు 85 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. అయితే వర్క్ ఫ్రం హోం – వర్క్ ఫ్రం ఆఫీస్ రెండు ఐశ్ఛికాలలో ఏది కావాలంటే అది ఎంచుకునే వెసులుబాటు ఉద్యోగులకు కల్పించాలని కోరుతున్నారు. స్పేస్ మ్యాట్రిక్స్ నిర్వహించిన ఈ సర్వోలో పాల్గొన్న ఉద్యోగులు..వర్క్ ఫ్రం హోమ్‌లో తమ ఉత్పాదకత తగ్గినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. సరైన సాంకేతిక వనరులు అందుబాటులో లేకపోవడం, ఇంటిలో ఏర్పడే అవాంతరాలే దీనికి కారణమని చెప్పారు. దీంతో పని మీద పూర్తిస్థాయిలో ధ్యాస పెట్టలేకపోతున్నట్లు తెలిపారు. అలాగే తమ పనిలో నాణ్యత కూడా తగ్గుతున్నట్లు వివరించారు.
ఆఫీస్‌కు వెళ్లి పనిచేసేందుకు ఎందుకు మొగ్గుచూపుతున్నారన్న ప్రశ్నకు స్పందించిన 43 శాతం మంది ఉద్యోగులు…ఆఫీస్‌లో అయితే టీమ్‌గా కలిసి పనిచేసేందుకు వీలుపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే 37 శాతం మంది ఉద్యోగులు…ఆఫీస్‌లో పనిచేస్తే తమకు ఇష్టమైన వర్క్ స్టేషన్‌ను ఎంచుకునేందుకు వీలుంటుందని, అలాగే సాంకేతిక వనరులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే తమకు నచ్చిన వ్యక్తులకు పక్కన కూర్చొని పనిచేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని చెప్పారు.
కరోనా పాండమిక్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు శాశ్వితంగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను ఇవ్వాలని భావిస్తున్నాయి. మరికొన్ని హైబ్రీడ్ మోడల్‌లో ఒక వారం వర్క్ ఫ్రం హోం, మరోవారం వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా తమ పనిలో ఉత్పాదకత తగ్గుతోందని స్వయంగా ఉద్యోగులు భావిస్తున్నట్లు ఆ సర్వే తేల్చింది. వర్క్ ఫ్రం హోం కారణంగా టీమ్ సభ్యుల మధ్య సమన్వయాన్ని కోల్పోతున్నట్లు 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇంటి నుంచి పనిచేస్తే వర్క్‌ను సరిగ్గా షెడ్యూల్ చేసుకోలేకపోతున్నామని…ఎక్కువ సమయం వర్క్‌తోనే గడపాల్సి వస్తోందని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు. తద్వారా వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కోల్పోతున్నట్లు వారు అభిప్రాయపడ్డారు. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగుల వెల్‌నెస్ కోసం ఆయా సంస్థలు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లను వర్క్ ఫ్రం హోం కారణంగా మిస్ అవుతున్నట్లు కొందరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఉసిరికాయలను ఇలా వాడితే జుట్టు రాలడం తగ్గడమే కాదు… చర్మ సమస్యలు కూడా దూరం….
ఆగస్టు నుంచి పీఎం కిసాన్ తొమ్మిదో విడత..! జూలై 31 లోపు ఎనిమిదో విడత డబ్బుల పంపిణీ పూర్తి..