IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి సత్తా.. ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌!

ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఎడ్వర్డ్‌ నాథన్‌ వర్ఘీస్‌ (21) అనే విద్యార్ధికి నెదర్లాండ్స్‌ కంపెనీ భారీ ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్ ఇచ్చింది. 2005 ఐఐటీ హైదరాబాద్‌ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న తొలి విద్యార్థిగా..

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి సత్తా.. ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌!
IIT Hyderabad student gets Rs 2.5 crore job offer

Updated on: Jan 02, 2026 | 12:42 PM

ఐఐటీ హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి జాక్‌పాట్ కొట్టాడు. ఈ ఏడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఎడ్వర్డ్‌ నాథన్‌ వర్ఘీస్‌ (21) అనే విద్యార్ధికి నెదర్లాండ్స్‌ కంపెనీ ఈ మేరకు భారీ ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్ ఇచ్చింది. 2005 ఐఐటీ హైదరాబాద్‌ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న తొలి విద్యార్థిగా ఎడ్వర్డ్‌ నాథన్‌ వర్ఘీస్‌ నిలిచాడు. ఈ ఏడాది జులైలో ఇంజనీరింగ్‌ పూర్తయిన వెంటనే గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎడ్వర్డ్‌ చేరనున్నాడు.

యేటా ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెట్‌లలో రికార్డు స్థాయిలో ముందుంటుందన్న సంగతి తెలిసిందే. 2017లో దాదాపు కోటి రూపాయల ప్యాకేజీతో ఇక్కడి విద్యార్ధి జాబ్‌ ఆఫర్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సగటున రూ. 60–90 లక్షల ఆఫర్‌లు రావడం పరిపాటిగా మారాయి. కానీ ఇంత పెద్ద భారీ ఫ్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ప్రముఖ గ్లోబల్‌ ట్రేడింగ్‌ సంస్థ ఆప్టివర్‌ అతడిని ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఎడ్వర్డ్‌ ఇదే కంపెనీలో 2 నెలల పాటు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కూడా చేశాడు. ఆ తర్వాత ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ రూపంలో అతడిని భారీ ఫ్యాకేజీతో ఈ ఉద్యోగం వరించింది. ఐఐటీ హైదరాబాద్‌ నుంచి ఈ కంపెనీ అందించిన సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు ఇద్దరు విద్యార్ధులు ఎంపికయ్యారు. కానీ ఫుల్‌ టైం ఆఫర్‌ ను అందుకున్న ఏకైక విద్యార్ధి మాత్రం ఎడ్వర్డ్ మాత్రమే. ఆప్టివర్‌ సంస్థ కార్యాలయం నెదర్లాండ్స్‌లో ఉంది. దీంతో IIT-H ఖాతాలో మరో అంతర్జాతీయ నియామకం చేరింది. కాగా హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఎడ్వర్డ్‌ 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బెంగళూరులో చదివాడు. 2022లో జేఈఈ మెయిన్‌లో ఆల్‌ఇండియా 1100 ర్యాంక్‌, అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియా 558వ ర్యాంక్‌ సాధించాడు.

తాజా క్యాంపస్‌ ప్లేస్‌మెట్లలో మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినట్లు ఐఐటీ హైదరాబాద్‌ తెలిపింది. ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో గత సంవత్సరంతో పోలిస్తే సగటు ప్యాకేజీ దాదాపు 75 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2024లో రూ. 20.8 లక్షల నుంచి రూ. 36.2 లక్షలకు పెరిగింది. డిసెంబర్‌లో ముగిసిన మొదటి దశ ప్లేస్‌మెంట్లలో, విద్యార్థులు 24 అంతర్జాతీయ ఆఫర్‌లను పొందారు. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 2వ దశలో ప్లేస్‌మెంట్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 650 మందిలో 196 మంది పిజి విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయని, సగటు ప్యాకేజీ రూ. 22 లక్షలుగా తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్లలో మొత్తం 487 మంది విద్యార్థులలో దాదాపు 62 శాతం మందికి ప్లేస్‌మెంట్ లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.