Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ప్రముఖ డెలివరీ సంస్థ జొమాటో. సెకండ్ గ్రేడ్ పట్టణాల్లో కూడా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకతను చాటుకున్న జొమాటో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెలివరీ భాగస్వాములుగా పెద్ద ఎత్తున మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించుకుందీ సంస్థ. ప్రస్తుతం డెలివరీ పార్ట్‌నర్స్‌లో మహిళల వాటా 0.5 శాతంగా ఉంది. అయితే దీనిని ఈ ఏడాది చివరి నాటికి ఏకంగా 10 శాతానికి పెంచనున్నట్లు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వెల్లడించారు.
తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, పుణేలో మహిళలను నియమించుకోనున్నారు. ఇదిలా ఉంటే మహిళలను డెలివరీ భాగస్వాములుగా నియమించుకోవడం అంత సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మహిళలను ఉద్యోగాల్లో తీసుకునే విషయమై దీపిందర్ మాట్లాడుతూ.. ‘మహిళలను ఈ రంగం ఆకర్శించడానికి, అలాగే వారు కొనసాగడానికి విధానాలు మారాలి. ఆత్మ రక్షణ కోసం తప్పనిసరిగా వారికి శిక్షణ ఇస్తున్నాం. మహిళల కోసం 24 గంటలూ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపత్కాలంలో లైవ్ లొకేషన్ క్షేత్ర స్థాయి సిబ్బందికి, కేంద్ర కార్యాలయానికి, సమీపంలో ఉన్న డెలివరీ భాగస్వాములకు వెంటనే చేరుతుంది. మహిళలకు కనీస వసతులు కల్పించేందుకు రెస్టారెంట్స్ సైతం ముందుకు వచ్చాయి` అని చెప్పుకొచ్చారు.
Also Read: Hyderabad Cricket Association: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్; మరింత రాజుకున్న వివాదం