Yes Bank: యస్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. బాండ్ హోల్డర్లకు ఊరట..షేర్లు ఢమాల్..

అంతా సర్దుమణిగింది.. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు సమసిపోయాయి అనుకుంటున్న వేళ, ప్రైవేట్ రంగ దిగ్గజం యస్ బ్యాంక్‌కుఊహించని పెద్ద షాక్ తగిలింది. 2020 నాటి సంక్షోభం సమయంలో బ్యాంక్ యాజమాన్యం ఏకపక్షంగా రద్దు చేసిన దాదాపు రూ.8,400 కోట్ల విలువైన ఏటీ-1 బాండ్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, బాండ్‌హోల్డర్లకు నిర్దేశిత వడ్డీతో మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

Yes Bank: యస్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. బాండ్ హోల్డర్లకు ఊరట..షేర్లు ఢమాల్..
Supreme Court Reverses Yes Bank At1 Bond Cancellation

Updated on: Oct 16, 2026 | 2:52 PM

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా బ్యాంక్ రద్దు చేసిన దాదాపు రూ. 8,400 కోట్ల విలువైన అడిషనల్ టైర్ 1 బాండ్ల రద్దును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బాండ్లను రద్దు చేసే అధికారం అప్పట్లో నియమితులైన అడ్మినిస్ట్రేటర్‌కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బాండ్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా పరిస్థితులు మారగా, యస్ బ్యాంక్‌పై ఒకేసారి భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఏర్పడింది.

బాంబే హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

2020 మార్చిలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను ఆదుకునే క్రమంలో ఆర్బీఐ ఈ రెస్క్యూ ప్లాన్‌ను అమలు చేసింది. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ చర్య వల్ల వేలాది మంది ఇన్వెస్టర్లు నష్టపోయారు. దీనిపై 2023లో బాంబే హైకోర్టు విచారణ చేపట్టి, బాండ్ల రద్దులో నియమ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ రద్దును కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యస్ బ్యాంక్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అక్కడ కూడా బ్యాంక్‌కు చుక్కెదురైంది.

భారీగా పతనమైన షేర్లు.. మూలధన సంక్షోభం పొంచి ఉందా?

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేశీయ స్టాక్ మార్కెట్లలో యస్ బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 14.5 శాతం నష్టపోగా, శుక్రవారం కూడా మరో 3.2 శాతం మేర పతనమయ్యాయి. బాండ్ హోల్డర్లకు పరిహారం చెల్లించాల్సి వస్తే బ్యాంక్ మూలధనంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

క్యాపిటల్ రేషియో తగ్గుదల: ఈ పరిణామంతో తమ కీలక క్యాపిటల్ రేషియో సుమారు 2.5 శాతం మేర పడిపోయే అవకాశముందని యస్ బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలు తమ వద్ద ఉన్నాయని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

నిధుల సమీకరణ ప్రశ్నార్థకం: బ్యాంకులో 24.9 శాతం వాటా కలిగి ఉన్న జపాన్‌కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ద్వారా గానీ, రైట్స్ ఇష్యూ ద్వారా గానీ బ్యాంక్ కొత్త నిధులను సమీకరించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణుడు దేవెన్ చోక్సీ విశ్లేషించారు.

బాండ్ మార్కెట్‌పై ప్రభావం – నిపుణుల విశ్లేషణ

సాధారణంగా బ్యాంకులు తీవ్ర నష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఏటీ1 బాండ్లను రైట్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే తాజా తీర్పు భవిష్యత్తులో జరిగే బ్యాంకుల పునర్నిర్మాణ ప్రక్రియలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘ఈ తీర్పు భవిష్యత్ బ్యాంక్ రెస్క్యూలకు ఒక ప్రమాణంగా మారుతుంది. అయితే ప్రభుత్వానికి, యస్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఇంకా ఉంది’’ అని ఎండ్రీ లీగల్ మేనేజింగ్ పార్టనర్ ఆశిష్ ప్యాసి తెలిపారు. ఈ తీర్పు బాండ్ మార్కెట్ ఇన్వెస్టర్లలో న్యాయపరమైన రక్షణపై నమ్మకాన్ని పెంచినప్పటికీ, భవిష్యత్తులో బ్యాంకులు ఏటీ1 బాండ్ల ద్వారా రుణాలు సేకరించేటప్పుడు వడ్డీ వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని రాక్‌ఫోర్ట్ ఫిన్‌క్యాప్ మేనేజింగ్ పార్టనర్ వెంకటకృష్ణన్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

ఈ బాండ్ల విలువ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నందున, కొటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ వంటి సంస్థలు తమ డెట్ స్కీమ్‌లలో కొత్త పెట్టుబడుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఒకవైపు న్యాయపరమైన సవాళ్లు, మరోవైపు అదనపు బాధ్యతల భారం నడుమ యస్ బ్యాంక్ ముందుముందు ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు ఆర్థిక రంగంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us