ఇంటి పైకప్పుకు ఏ రూఫింగ్ షీట్ బెస్ట్? టిన్, PUF, UPVC.. ధరలు, లాభనష్టాలు తెలుసుకోండి!

House Construction: మీ ఇంటికి లేదా షెడ్‌కు రూఫింగ్ షీట్లు వేయించాలని చూస్తున్నారా? ఈ వీడియో PUF, UPVC, టిన్ రూఫింగ్ షీట్ల మధ్య పూర్తి పోలికను అందిస్తుంది. వేడిని తగ్గించడం, ఖర్చు, మన్నిక, శబ్దం, లీకేజీలు, ప్రయోజనాలు, నష్టాలు, ప్రస్తుత ధరలు..

ఇంటి పైకప్పుకు ఏ రూఫింగ్ షీట్ బెస్ట్? టిన్, PUF, UPVC.. ధరలు, లాభనష్టాలు తెలుసుకోండి!
Roofing Sheet

Updated on: Oct 23, 2026 | 11:19 AM

House Construction: మీ ఇంటికి లేదా షెడ్‌కు పైకప్పును నిర్మించేటప్పుడు రూఫింగ్ షీట్లను ఎంచుకోవడం ఒక కీలకమైన నిర్ణయం. సరైన ఎంపిక వేడి, లీకేజీలు, శబ్దం వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మూడు ప్రముఖ రూఫింగ్ షీట్ల రకాలైన టిన్/కలర్ జీఐ షీట్లు, PUF (పాలియురిథిన్ ఫోమ్) షీట్లు, UPVC (అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్) షీట్ల ధరలు, ప్రయోజనాలు, నష్టాలు, వాటి పనితీరు గురించి తెలుసుకుందాం. అయితే ఈ వివరాలు మేస్త్రీలు, బిల్డర్స్‌ అనుభవం ఆధారంగా అందిస్తున్నాము. మీరు కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, ధర వివరాలు తెలుసుకోవడం మంచిది. అలాగే ఇక్కడ అందించిన ధరలు కాకుండా మీ ప్రాంతాన్ని బట్టి తేడా ఉండవచ్చని గమనించండి.

1. టిన్/కలర్ జీఐ రూఫింగ్ షీట్లు (Tin / Colour GI Roofing Sheets)

ఇవి సాధారణంగా ఐరన్ లేదా గాల్వనైజ్డ్ ఐరన్‌తో తయారు చేసిన రేకులు. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. అందుకే వీటిని కలర్ జీఐ షీట్లు అని కూడా అంటారు.

ప్రయోజనాలు:

  • ఖర్చు తక్కువ: ఇతర షీట్లతో పోలిస్తే ఇవి బడ్జెట్‌కు అనుకూలమైనవి.
  • మన్నిక: సిమెంట్ రేకులతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నుతాయి.
  • అందమైన రూపు: వివిధ రంగులలో లభించడం వల్ల చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.
  • తక్కువ లీకేజీలు: సరిగ్గా వేస్తే వాటర్ లీకేజీ సమస్యలు తక్కువ.
  • తక్కువ నిర్వహణ: ఒకసారి వేసిన తర్వాత ఎక్కువ నిర్వహణ అవసరం లేదు.

నష్టాలు:

  • ఎక్కువ వేడి: వేసవిలో వీటి కింద చాలా వేడిగా ఉంటుంది. లోపల సీలింగ్ వేసినా వేడి తగ్గే అవకాశం తక్కువ.
  • శబ్దం: వర్షం పడినప్పుడు ఎక్కువ శబ్దం చేస్తాయి.
  • తుప్పు: కొన్ని సంవత్సరాల తర్వాత తుప్పు పట్టడం, నల్లటి మచ్చలు రావడం గమనించవచ్చు.
  • లోపల వైపు: శీతాకాలంలో లోపల వైపు స్వెట్ పట్టి నీటి చుక్కలు పడవచ్చు.
  • ధర: సుమారు రూ.50 ప్రతి చదరపు అడుగు. 12 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న ఒక షీట్ ధర రూ.2000 నుండి రూ.2200 వరకు ఉండవచ్చు.

2. PUF (పాలియురిథిన్ ఫోమ్) రూఫింగ్ షీట్లు

వీటిని PUF ప్యానెల్స్ లేదా శాండ్‌విచ్ ప్యానెల్స్ అని కూడా అంటారు. రెండు లోహపు షీట్ల మధ్య పాలియురిథిన్ ఫోమ్ పొరను కలిగి ఉంటాయి.

ప్రయోజనాలు:

  • అద్భుతమైన వేడి నిరోధకత: లోపలి వేడిని బయటికి వెళ్ళనివ్వకుండా, బయటి వేడిని లోపలికి రాకుండా అద్భుతంగా నియంత్రిస్తాయి. ఏసీ వాడే ప్రాంతాలకు చాలా ఉపయోగకరం.
  • తక్కువ శబ్దం: వర్షం పడినప్పుడు శబ్దం చాలా తక్కువగా ఉంటుంది.
  • లీకేజీలు లేవు: జాయింట్స్ సరిగ్గా ఉంటే నీటి లీకేజీ సమస్య ఉండదు.
  • నివారణ: స్వెట్ పట్టి నీటి చుక్కలు పడవు.

నష్టాలు:

  • అధిక ఖర్చు: ఇవి మిగిలిన రెండు షీట్లతో పోలిస్తే చాలా ఖరీదైనవి.
  • జాయింట్స్ ప్రాబ్లమ్స్: జాయింట్స్ సరిగ్గా చేయకపోతే లీకేజీలు వచ్చి తుప్పు పట్టవచ్చు.
  • అగ్ని ప్రమాదం: లోపల ఫోమ్ ఉండటం వల్ల అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి.
  • ధర: సుమారు రూ.150 నుండి రూ.160 ప్రతి చదరపు అడుగు. 12 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న ఒక షీట్ ధర రూ.6300 వరకు ఉండవచ్చు.
  • ఉపయోగాలు: పెద్ద షెడ్‌లు, గోదాములు, ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్‌లు, షాపులు, రెస్టారెంట్లు, ఇంటి పైకప్పులకు కూడా అనుకూలం.

3. UPVC (అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్) రూఫింగ్ షీట్లు

ఇవి అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్ అనే పదార్థంతో తయారు చేస్తారు. మల్టీలేయర్ టెక్నాలజీతో వస్తాయి.

ప్రయోజనాలు:

  • వేడి నియంత్రణ: వేడిని బాగా తట్టుకొని, లోపలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
  • తక్కువ శబ్దం: వర్షం పడినప్పుడు శబ్దం చాలా తక్కువగా ఉంటుంది.
  • బలమైనవి: కొబ్బరి కాయలు లేదా కోతులు దూకినా అంత త్వరగా పగలవు, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి.
  • తేలికైనవి: బరువు తక్కువగా ఉండటం వల్ల రూఫింగ్ నిర్మాణంపై భారం తగ్గుతుంది.
  • తుప్పు పట్టవు: లోహపు షీట్లు కానందున తుప్పు పట్టే సమస్య ఉండదు.
  • 100% వాటర్‌ప్రూఫ్: లీకేజీ సమస్యలు చాలా తక్కువ, స్క్రూలకు క్యాప్స్ ఉండటం వల్ల లీక్ అయ్యే అవకాశం తగ్గుతుంది.
  • వాతావరణ నిరోధకత: రసాయనాలకు, అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటాయి.

నష్టాలు:

  • అగ్ని ప్రమాదం: అగ్ని ప్రమాదాలు జరిగితే త్వరగా కాలిపోయే అవకాశం ఉంది.
  • గాలికి ఊడిపోవడం: బలమైన గాలులు వీచినప్పుడు ఫిట్టింగ్ సరిగా లేకపోతే ఊడిపోయే అవకాశం ఉంది.
  • రంగు మార్పు: కాలక్రమేణా రంగు మారవచ్చు లేదా పెళుసుగా మారవచ్చు.
  • రిపేర్: షీట్ మధ్యలో సమస్య వస్తే మొత్తం షీట్‌ను మార్చాల్సి రావచ్చు.
  • ధర: సుమారు రూ.60 నుండి రూ.70 ప్రతి చదరపు అడుగు. 12 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న ఒక షీట్ ధర రూ.2940 వరకు ఉండవచ్చు.
  • ఉపయోగాలు: ఇళ్లు, రిసార్ట్‌లు, ఆధునిక విల్లాలు (కేరళ స్టైల్), ఫామ్ హౌసులు, ఫ్యాక్టరీలు, గోదాములు, పాఠశాలలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు.

మీరు బడ్జెట్‌లో రూఫింగ్ కోరుకుంటే టిన్/కలర్ జీఐ షీట్లు మంచివి. కొద్దిగా ఖర్చు ఎక్కువైనా వేడి, శబ్దం తక్కువగా ఉండాలని కోరుకుంటే UPVC షీట్లు సరైనవి. అత్యుత్తమ వేడి నిరోధకత, శబ్ద నియంత్రణ కావాలంటే ఖర్చుతో సంబంధం లేకుండా PUF షీట్లు ఉత్తమ ఎంపిక. మీ ప్రాంతం, బడ్జెట్, నాణ్యత, అవసరాలను బట్టి సరైన రూఫింగ్ షీట్‌ను ఎంచుకోండి. ధరలు బ్రాండ్, మందం, నాణ్యత, ప్రాంతాన్ని బట్టి మారుతాయని గమనించండి.

ఇది కూడా చదవండి: BSNL Bharat Fiber: రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌.. 25కుపైగా OTTలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us