
ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల్లో కొత్త ధోరణి కనిపిస్తోంది. దీన్ని నిపుణులు జాబ్ హగ్గింగ్ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఉద్యోగులు తాము చేస్తున్న పనిని ఇష్టపడనప్పటికీ లేదా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రస్తుత ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి భయపడుతున్నారు. అమెరికాలో ఇటీవలి కాలంలో ఉద్యోగాల కల్పన తగ్గింది. దీంతో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి పట్టే సమయం కూడా 8 వారాల నుంచి 10 వారాలకు పెరిగింది. కోవిడ్ తర్వాత లేఆఫ్‌లు ఎక్కువగా ఉండడంతో చాలామంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగంలోనే సురక్షితంగా ఉండాలని భావిస్తున్నారు.
ఈ జాబ్ హగ్గింగ్ అనేది ఉద్యోగులు తమ కంపెనీ పట్ల విధేయతగా ఉన్నారని కాదు.. అది భయానికి సూచన అని నిపుణులు అంటున్నారు. చాలామంది ఉద్యోగులు చేస్తున్న పనితో సంతృప్తిగా లేరు. అయినప్పటికీ బయట పరిస్థితులు బాగోలేవని భయపడి ఉద్యోగాన్ని వదిలి వెళ్ళడం లేదు. అయితే ఉద్యోగులు తమ ఉద్యోగాల్లోనే కొనసాగడం యజమానులకు మంచిదిగా అనిపించవచ్చు. దీనివల్ల ఉద్యోగుల మార్పు రేటు తగ్గుతుంది. కొత్తవారిని నియమించుకునే ఖర్చులు తగ్గుతాయి. అయితే దీర్ఘకాలంలో ఇది కంపెనీలకు హానికరం.
క్రియేటివిటీ తగ్గుతుంది: ఉద్యోగులు కొత్తగా ఆలోచించడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల కంపెనీలో కొత్త ఆవిష్కరణలు తగ్గుతాయి.
పని నాణ్యత పడిపోతుంది: ఉద్యోగులు కేవలం మనుగడ కోసం పనిచేస్తున్నప్పుడు, వారి పనితీరు కూడా తగ్గుతుంది.
ప్రోత్సాహం తగ్గుతుంది: భయంతో ఉద్యోగంలో ఉన్నవారు ఉత్సాహంగా ఉండలేరు. దీనివల్ల కంపెనీలో మొత్తం పని వాతావరణం దెబ్బతింటుంది.
ఈ సమస్యను అధిగమించాలంటే యజమానులు కేవలం ఉద్యోగ భద్రత కల్పించడం సరిపోదు. తమ ఉద్యోగులు తమతో ఎందుకు ఉండాలి అనేదానికి ఒక బలమైన కారణం చూపించాలి.
అభివృద్ధి అవకాశాలు: ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించాలి.
అర్థవంతమైన పని: వారు చేస్తున్న పనిలో వారికి ఒక ఉద్దేశ్యం కనిపించేలా చూడాలి.
పదోన్నతులు: అంతర్గతంగానే పదోన్నతులు, కొత్త పాత్రలు ఇచ్చి ప్రోత్సహించాలి.
ఉద్యోగులు తాము ఉన్న చోట ఎదుగుతున్నామని భావిస్తే, బయట మార్కెట్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. “జాబ్ హగ్గింగ్” ఒక చిన్న సమస్యలా అనిపించినా.. అది నిశ్శబ్దంగా ఒక కంపెనీ ప్రగతిని అడ్డుకుంటుంది. అందుకే యజమానులు ఈ ధోరణిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..