లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగితా ఈఎంఐలు ఎవరు కట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..

బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది? మిగిలిపోయిన ఈఎంఐలు కుటుంబ సభ్యులే చెల్లించాలా లేక బ్యాంకులు ఆ రుణాన్ని మాఫీ చేస్తాయా? ఇల్లును బ్యాంకులు జప్తు చేసే హక్కు ఉందా? క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, హోమ్ లోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం..

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగితా ఈఎంఐలు ఎవరు కట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..
Loan After Borrower Death

Updated on: Aug 15, 2026 | 10:17 PM

బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే మిగిలిన బాకీని ఎవరు చెల్లించాలి? ఆ రుణం పూర్తిగా మాఫీ అవుతుందా? లేక కుటుంబ సభ్యులు, వారసులు లేదా హామీదారులపై భారం పడుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతుంటాయి. అయితే లోన్ రకాన్ని బట్టి బ్యాంకింగ్ నిబంధనలు మారుతుంటాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డుల బకాయిలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

క్రెడిట్ కార్డ్ బాకీలు

క్రెడిట్ కార్డు రుణాలు పూర్తిగా అసురక్షిత కేటగిరీ కిందకు వస్తాయి. కార్డుదారుడు మరణిస్తే ఆ బకాయిలను చెల్లించే చట్టపరమైన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉండదు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్ కార్డు బకాయిల కోసం బ్యాంకులు కుటుంబ సభ్యులను వేధించకూడదు. అయితే మరణించిన వ్యక్తి పేరిట అదే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర సేవింగ్స్ డిపాజిట్లు ఉంటే చట్టపరమైన మార్గాల ద్వారా బ్యాంకు ఆ మొత్తాన్ని బకాయి కింద జమ చేసుకునే హక్కు కలిగి ఉంటుంది. ఎటువంటి ఆస్తులు లేదా డిపాజిట్లు లేకపోతే, బ్యాంకు ఆ బకాయిని రద్దు చేసి నష్టంగా పరిగణిస్తుంది.

పర్సనల్ లోన్స్ బకాయిల రికవరీ ఎలా?

పర్సనల్ లోన్లు కూడా సాధారణంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే మంజూరవుతాయి. రుణగ్రహీత మరణించినప్పుడు లోన్ అగ్రిమెంట్‌లో కో అప్లికెంట్ లేదా గ్యారెంటర్ ఉంటే బకాయిలను తీర్చే పూర్తి బాధ్యత వారిపైనే ఉంటుంది. ఒకవేళ ఎవరూ లేకపోతే, మరణించిన వ్యక్తి వదిలివెళ్లిన ఆస్తులు, పొదుపు లేదా ఇతర డిపాజిట్ల నుంచి నిబంధనల ప్రకారం బ్యాంకు ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటుంది. ఎలాంటి ఆస్తులు లేని సందర్భంలో రుణాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.

హోమ్, వాహన లోన్స్..?

హోమ్ లోన్, ఆటో లోన్లు సురక్షిత రుణాలు. వీటికి ఆస్తి పత్రాలు లేదా వాహన ఆర్సీ కార్డులు బ్యాంకు వద్ద హామీగా ఉంటాయి. రుణగ్రహీత మరణిస్తే బ్యాంకు మొదట కో అప్లికెంట్‌ను సంప్రదిస్తుంది. వారు బాకీ చెల్లించకపోతే గ్యారెంటర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. రుణం తీసుకునే సమయంలో లోన్ ఇన్సూరెన్స్ లేదా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయించి ఉంటే, బీమా కంపెనీయే మిగిలిన ఈఎంఐ మొత్తాన్ని చెల్లిస్తుంది. దీనివల్ల కుటుంబంపై ఆర్థిక భారం పడదు, ఆస్తి కూడా వారి చేతుల్లోనే సురక్షితంగా ఉంటుంది.

సర్ఫేసీ చట్టం

ఎటువంటి బీమా లేకపోయినా, కుటుంబ సభ్యులు మిగిలిన బాకీ చెల్లించడానికి ముందుకు రాకపోయినా బ్యాంకులు ఆ ఖాతాను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తాయి. అనంతరం సర్ఫేసీ చట్టం సెక్షన్ 13 కింద ఆస్తిని జప్తు చేసి, బహిరంగ వేలం ద్వారా తమ బకాయిలను రికవరీ చేసుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us