ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు గుడ్‌న్యూస్‌! ఇక పెట్రోల్‌, డీజిల్‌ గురించి టెన్షన్‌ లేదు!

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాలు దెబ్బతింటున్న వేళ, భారతదేశానికి వెనిజులా కీలక ప్రత్యామ్నాయంగా మారుతోంది. మే నెలలో వెనిజులా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. ఇంధన భద్రత కోసం భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారిస్తోంది.

ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు గుడ్‌న్యూస్‌! ఇక పెట్రోల్‌, డీజిల్‌ గురించి టెన్షన్‌ లేదు!
Hormuz Crisis

Updated on: May 24, 2026 | 7:37 AM

ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతం నుంచి ముడి చమురు సరఫరాలు దెబ్బతినడంతో అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి వెనిజులా ఒక కీలక ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఈ నెలలో వెనిజులా, భారతదేశానికి మూడవ అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించడం అంతర్జాతీయ ఇంధన రంగంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంధన ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో భారతదేశానికి వెనిజులా చమురు సరఫరా దాదాపు 50 శాతం పెరిగింది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరాలు తగ్గుతున్న నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ వనరుల కోసం వేగంగా ప్రయత్నాలు ప్రారంభించింది. దేశానికి అవసరమైన ముడి చమురులో సగానికి పైగా హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే చేరుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలతో ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. ఏడేళ్ల విరామం తర్వాత భారత్ ఇటీవల ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పునఃప్రారంభించినప్పటికీ, అమెరికా నావికా దిగ్బంధనం కారణంగా కొత్త సరుకులు ఈ నెలలో భారత్‌కు చేరలేదు. మరోవైపు సౌదీ అరేబియా నుంచి సరఫరాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.

ఏప్రిల్‌లో రోజుకు సుమారు 6.7 లక్షల బ్యారెళ్ల చమురు అందగా, ఇప్పుడు అది 3.4 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. గల్ఫ్ ప్రాంతంలో 13 భారతీయ నౌకలు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న ఓ నౌకపై దాడి జరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా కూడా వెనిజులా చమురును ప్రపంచ మార్కెట్లోకి తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నాయి. సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నప్పటికీ, అమెరికా ఆంక్షలు మరియు ఆర్థిక సమస్యల వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఇరాన్, రష్యాలపై ఆధారాన్ని తగ్గించేందుకు వెనిజులాను ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తున్నారు.

భారత్‌కు వెనిజులా చమురు కొత్తది కాదు. 2019కు ముందు వెనిజులా భారత్‌కు ప్రధాన సరఫరాదారులలో ఒకటిగా ఉండేది. ముఖ్యంగా గుజరాత్‌లోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జామ్‌నగర్ రిఫైనరీకి వెనిజులా హెవీ క్రూడ్ ఆయిల్ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం వెనిజులా రోజుకు సుమారు 4.17 లక్షల బ్యారెళ్ల చమురును భారత్‌కు సరఫరా చేస్తోంది. హోర్ముజ్ సంక్షోభం కొనసాగితే, భారత ఇంధన భద్రతలో వెనిజులా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us