Fall in vegetable prices in Telangana : కూరగాయల ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ కిలో 40 – నుంచి 50రూపాయలు పలికిన రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో సదానందం అనే రైతు టమాట సాగు చేసాడు. లాక్‌డౌన్ తర్వాత వంద రూపాయల వరకు పలికిన కిలో ధర 20రోజుల క్రితం టమాట ధర పాతాళానికి పడిపోవడంతో అయోమయంలో పడ్డాడు. మొక్కలకి ఉన్న టమాటలను కూలీలతో కోయిస్తే వాళ్ల కూలీ డబ్బులు కూడా రావని తెలిసి చేతికొచ్చిన పంటను ట్రాక్టర్‌తో పొలంలోనే దున్నేశాడు.
ఒక్క సదానందం పరిస్థితే కాదు..మిగిలిన కూరగాయలు పండిస్తున్న రైతులకు ఈ కష్టాలు తప్పడం లేదు. పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే ….కిలో 5రూపాయలు పలకని దయనీస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోనే కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కూరగాయల సాగుపై పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి మార్కెట్లో బెండకాయకి పూర్తిగా ధర పడిపోవడంతో వచ్చిన కస్టమర్లకు ఫ్రీగానే ఇవ్వాల్సి వస్తోంది రైతులు. ఎక్కువమంది రైతులు కూరగాయల సాగుపైనే ఆసక్తి చూపడం వల్లే ధరలు ఇంతగా పడిపోతున్నాయంటున్నారు. పది రూపాయలు వస్తాయని ఆశించి సాగు చేస్తున్న కూరగాయల రైతుల కష్టాలను ప్రభుత్వం కాని, ఉద్యానవన అధికారులు కాని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగిన మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.