
వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక్క వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తోండగా.. మరిన్ని సర్వీసులు విడతల వారీగా రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. దీంతో రెండో ట్రైన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని రైల్వే ప్రయాణికులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు రెండో భారత్ స్లీపర్ రైలుపై క్లారిటీ వచ్చింది. దీపావళి కానుకగా రెండో సర్వీసును పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు అయింది. పండక్కి ముందే అక్టోబర్ 31వ తేదీన రెండో వందే భారత్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది..? ఏయే స్టేషన్లలో ఆగుతుంది..? దీని ప్రత్యేకతలు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.
రెండో వందే భారత్ స్లీపర్ రైలు అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. వారణాసి-ఢిల్లీ మధ్య దీనిని తిప్పనున్నారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ రైలును ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనిని నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రాత్రిపూట ప్రయాణించేవారికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది. యూపీలోని నాలుగు కీలక నగరాల్లో ఇది ఆగనుంది. ప్రయోగరాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్, ఘజియాబాద్ స్టేషన్లలో స్టాపులు కల్పించారు. యూపీలోని అనేక ప్రధాన నగరాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించడంలో ఇది కీలకంగా మారనుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అన్నీ ఏసీ స్లీపర్ కోచ్‌లే ఉంటాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండగా.. 160 కిలోమీటర్లు వేగంతో నడుస్తాయి.
ఈ స్లీపర్ రైల్లో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఏసీ థర్డ్ టైర్ బెర్త్‌లు 611, ఏసీ 2 టైర్ బెర్త్‌లు 188, మొదటి ఏసీ బెర్త్‌లు 24 అందుబాటులో ఉంటాయి. ఇక రాత్రిపూట నిద్రపోతూ హాయిగా ప్రయాణించేందు వీలుగా ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. ఇక 52 వాక్యూమ్ టాయిలెట్లు, సీల్డ్ గ్యాంగ్‌వేలు ఉంటాయి. ఆహారం వడ్డించడానికి చిన్న చిన్న నిల్వ గదులు అందుబాటులో ఉంటాయి. ఇక దేశీయ కవచ్ వ్యవస్థ, నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు, మంటలను నియంత్రించేందుకు అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థలు వంటివి ఉంటాయి. కాగా ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య తొలి స్లీపర్ రైలు నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో దీనిని ప్రారంభించగా.. ప్రయాణికుల నుంచి అద్బుత స్పందన వస్తోంది. దీంతో దశలవారీగా ఈ రైలు సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. త్వరలో బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడపనున్నారు. నవంబర్‌లో ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ రైలు ఏపీలోని అనంతపురం, గుంతకల్ స్టేషన్ల మీదుగా వెళ్లనుంది.