బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. అక్టోబర్ 15 నుంచి ఇబ్బందే ఉండదు.. ఏటీఎంల ద్వారా..

కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. రూ.2000 పైన చేసే ట్రాన్సాక్షన్‌లపై ఎండీఆర్ చార్జీలు విధించనుంది. అయితే ఇవి పర్సన్-టు-పర్సన్ చెల్లింపులకు కాకుండా మర్చెంట్లకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ క్రమంలో బ్యాంకులకు ఆర్బీఐ కీలక సూచనలు చేసింది.

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. అక్టోబర్ 15 నుంచి ఇబ్బందే ఉండదు.. ఏటీఎంల ద్వారా..
Atm

Updated on: Oct 02, 2026 | 9:06 PM

యూపీఐ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రూ.2000కు మించిన యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) ఛార్జీలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మీరు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లేదా ఇతర వ్యక్తులకు ఎంత మొత్తం పంపినా ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ కొత్త నిబంధనలు కేవలం రిజిస్టర్డ్ వ్యాపారులకు (మర్చెంట్లకు) యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి.  మీరు ఒక షాపులో వస్తువులు కొని యూపీఐ ద్వారా చెల్లింపు చేస్తే..ఆ వ్యాపారి ఖాతా నుండి బ్యాంకులు ఎండిఆర్. ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ చార్జీలను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వ్యాపారుల నుండి వసూలు చేస్తారు. యూపీఐ ద్వారా జరిగే రూ2000పైన ఉన్న చెల్లింపులకు ఈ ఛార్జీ 0.4 శాతంగా కేంద్రం నిర్ణయించింది. ఈ ఛార్జీలు వ్యాపారుల ఖాతాల నుండి నేరుగా తీసివేస్తారు. చిన్న వ్యాపారులు, తమ వ్యాపారాన్ని యూపీఐ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారిని ఇవి ప్రభావితం చేయనున్నారు. వారు తమ లావాదేవీలపై పడే ఛార్జీల గురించి అవగాహన కలిగి ఉండాలి.

అయితే కొన్ని ప్రత్యేక రంగాలకు ఈ 0.4 శాతం ఛార్జ్ వర్తించదు. రైల్వే టిక్కెట్లు, టెలికాం బిల్లులు, బీమా ప్రీమియంలు, ఇంధన కొనుగోళ్లు వంటి సేవలకు యూపీఐ ద్వారా ఎంత మొత్తం చెల్లించినా కేవలం స్థిరంగా రూ.5 మాత్రమే ఛార్జీగా వసూలు చేస్తారు. ఉదాహరణకు మీరు రూ.75,000 విలువైన బీమా ప్రీమియంను యూపీఐ ద్వారా చెల్లిస్తే.. వ్యాపారికి కేవలం రూ.5 మాత్రమే ఛార్జ్ పడుతుంది. ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో మీరు ఏదైనా వ్యాపార సంస్థకు యూపీఐ ద్వారా చెల్లింపు చేసినా, ఆ ఛార్జ్ సంబంధిత వ్యాపార సంస్థకు వర్తిస్తుంది. వినియోగదారులు మాత్రం ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా యూపీఐ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకతను, స్థిరత్వాన్ని పెంచే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చింది.

అయితే యూపీఐ ఛార్జీలపై వ్యాపారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి క్యాష్ పేమెంట్ల వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఈ క్రమంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో తగినంత నగదు లభ్యత ఉండేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులను ఆదేశించాయి. ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు తాత్కాలికంగా నగదుపై ఆధారపడే అవకాశం లేకపోలేదు. దీంతో ఏటీఎంలలో నగదు నిల్వ ఉంచాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. మారుతున్న డిజిటల్ చెల్లింపుల వాతావరణం మధ్య లావాదేవీలు సజావుగా జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us