
మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా శిశువులకు జన్మనిచ్చే గర్భిణులకు భరోసా కల్పించేందుకు ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అనే పథకాన్ని అమలు చేస్తోంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యం, పోషకాహారాన్ని అందించడంలో భాగంగా జనవరి 1,2017న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. నేటితో పథకం ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీని ద్వారా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల్లోని మహిళలకు రూ.6 వేల సాయం అందిస్తోంది. ఈ పథకం గురించి చాలామందికి అవగాహన లేక ఉయోగించుకోలేకపోతున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి అనే విషయాలు చూద్దాం.
గర్భిణీ స్త్రీలు జన్మనిచ్చే మొదటి బిడ్డకు రూ.5 వేల సాయం అందిస్తారు. రెండు విడతలుగా వీటిని అందిస్తారు. ఇందుకోసం అంగన్ వాడీ కేంద్రంలో గర్భధారణ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి రుతుక్రమ తేదీ నుండి ఆరు నెలలలోపు అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. గర్భధారణ నమోదు చేసుకోగానే రూ.3 వేలు అందిస్తారు. ఇక ప్రసవం నమోదు చేసుకున్నాక రూ.2 వేలు అందిస్తారు. ఇక రెండో బిడ్డకు కూడా రూ.5 వేల వరకు సాయం పొందవచ్చు. ఒకవేళ రెండో బిడ్డ ఆడపిల్ల అయితే ఒకే విడతలో రూ.6 వేల సాయం అందిస్తారు.
-కనీసం 19 సంవత్సరాలు నిండి గర్భిణీ స్త్రీ అయి ఉండాలి
-దరఖాస్తుదారురులు ఉద్యోగం చేస్తూ గర్భం కారణంగా వేతన నష్టం అనుభవిస్తూ ఉండాలి
-బిడ్డ పుట్టిన 270 రోజుల్లోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
-షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలు అయి ఉండాలి
-బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి
-ఈ శ్రమ్ కార్డు ఉండాలి
-MGNREGA జాబ్ కార్డు ఉండాలి
-కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి
-పాక్షికంగా (40%) లేదా పూర్తిగా వైకల్యం ఉన్న మహిళలు
ఆధార్, బ్యాంక్ అకౌంట్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, పిల్లల రోగనిరోధకత వివరాలు, MCP/RCHI కార్డ్, LMP తేదీ, ANC తేదీ ఆధారాలు ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్, MGNREGA జాబ్ కార్డు, ఈశ్రమ్ కార్డు, రేషన్ కార్డు వంటివి అప్ లోడ్ చేయాలి.
https://pmmvy.wcd.gov.in/ వెబ్‌సైట్లోకి వెళ్లి వెబ్‌సైట్లోకి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్, బ్యాంక్ వివరాలన్నీ అప్ లోడ్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత అధికారులు ధృవీకరించి మీకు అకౌంట్లో డబ్బులు విడతల వారీగా జమ చేస్తారు. ఇక అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.