
ఇటీవల ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం దాదాపు 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 225 కోట్లు) ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయన భౌతికకాయాన్ని కడసారి దర్శనం కోసం ఇరాన్, ఇరాక్‌లలోని ఐదు ప్రముఖ నగరాలకు తీసుకెళ్లారు. దీనికోసం టెహ్రాన్‌లోనే దాదాపు 15 మిలియన్ యూరోలు, పవిత్ర నగరాలైన కోమ్, మషద్‌లలో 5 మిలియన్ యూరోలు కేటాయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
చరిత్రకారుల అంచనాల ప్రకారం.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అంత్యక్రియలు గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌వి. ఆయన అంత్యక్రియల కోసం దాదాపు 600 మిలియన్ డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీలో సుమారు రూ. 5,000 కోట్లకు పైగా) ఖర్చు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని నిఖార్సయిన బంగారు శవపేటికలో ఉంచారు. అంతేకాకుండా, ఆ శవపేటికను తరలించడానికి డజన్ల కొద్దీ గుర్రాలు లాగే ఒక భారీ సువర్ణ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు.
2004లో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మరణించినప్పుడు నిర్వహించిన ప్రభుత్వ అధికారిక అంత్యక్రియలకు దాదాపు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,300 కోట్లు) ఖర్చయింది. ఆధునిక చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన అంత్యక్రియలలో ఒకటిగా నిలిచింది. రీగన్ మరణానంతరం అమెరికాలో 7 రోజుల పాటు జాతీయ సెంతాప దినాలు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2022లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలను యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 160 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,300 కోట్లు) ఖర్చు చేశారు. ఈ బడ్జెట్‌లో సింహభాగం సైనిక కవాతులు, దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీసు భద్రత, ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన అంతర్జాతీయ ప్రముఖుల వసతి, ప్రోటోకాల్ ఏర్పాట్ల కోసమే ఖర్చయింది.
ఉత్తర కొరియా మాజీ పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ అంత్యక్రియలు 2011లో జరిగాయి. దీనికోసం దాదాపు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 330 కోట్లు) ఖర్చు చేశారు. నివేదికల ప్రకారం.. ఆయన భౌతికకాయం చెడిపోకుండా శాశ్వతంగా భద్రపరచడానికి (ఎంబాల్మింగ్) రష్యాకు చెందిన నిపుణులను రప్పించారు. అలాగే ఆయన జ్ఞాపకార్థం భారీ స్మారక చిహ్నాలు, విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఈ నిధులను ఉపయోగించారు.
1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురైన తర్వాత, వాషింగ్టన్ డీసీలో ఆయనకు భారీ ఎత్తున అధికారిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వీడ్కోలు వేడుకల కోసం అప్పట్లోనే దాదాపు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 125 కోట్లు) ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి