Home Loan: గృహ రుణాలపై వడ్డీని ఆదా చేయాలా.. ఈ చిట్కాలు పాటించండి..

ప్రతినెలా ఈఎమ్ఐ చెల్లించేలా దాదాపు 20 ఏళ్లకు పైబడిన కాలపరిమితికి రుణాలు తీసుకుంటారు. ఆ ఈఎమ్ఐలోనే మీరు తీసుకున్న అప్పు, దానిపై వడ్డీ కలిపి ఉంటాయి. ఈఎమ్ఐ కట్టడం సులభమైన విధానం అయినప్పటికీ బ్యాంకులు వడ్డీ రేట్లను పదేపదే పెంచడం వల్ల మీకు నష్టం కలుగుతుంది. మీ గృహ రుణాన్ని అనుకున్న కాలానికన్నా ముందే చెల్లించడం వల్ల మీకు అనేక లాభాలు కలుగుతాయి.

Home Loan: గృహ రుణాలపై వడ్డీని ఆదా చేయాలా.. ఈ చిట్కాలు పాటించండి..
Home Loan

Updated on: Mar 24, 2024 | 7:56 AM

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకోవడానికిి నిత్యం కష్టపడుతుంటారు. సాధారణంగా ఇల్లు కట్టుకోవడం లేదా ఫ్లాట్ కొనుక్కోవడానికి గృహ రుణాలపై ఆధారపడతారు. ప్రతినెలా ఈఎమ్ఐ చెల్లించేలా దాదాపు 20 ఏళ్లకు పైబడిన కాలపరిమితికి రుణాలు తీసుకుంటారు. ఆ ఈఎమ్ఐలోనే మీరు తీసుకున్న అప్పు, దానిపై వడ్డీ కలిపి ఉంటాయి. ఈఎమ్ఐ కట్టడం సులభమైన విధానం అయినప్పటికీ బ్యాంకులు వడ్డీ రేట్లను పదేపదే పెంచడం వల్ల మీకు నష్టం కలుగుతుంది. మీ గృహ రుణాన్ని అనుకున్న కాలానికన్నా ముందే చెల్లించడం వల్ల మీకు అనేక లాభాలు కలుగుతాయి. వడ్డీ రూపంలో లక్షల రూపాయలు మిగులుతాయి. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏంటో తెలుసుకుందాం.

ప్రీ పేమెంట్‌తో ప్రయోజనం..

మీరు తీసుకున్న రుణానికి అదనపు చెల్లింపులు (ప్రీ-పేమెంట్) చేయడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. రుణం వాయిదాలు పూర్తయ్యేలోపు మీరు చెల్లించే వడ్డీని గణనీయంగా తగ్గుతుంది. మీ నెలవారీ చెల్లింపులను పెంచడం, లేదా ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల రుణాన్ని త్వరగా తీర్చవచ్చు. తీసుకున్న రుణానికి సాధారణంగా నెలకు కొంత మొత్తం చెల్లిస్తుంటాం. అయితే మీకు వీలు కుదిరినప్పుడు అదనపు చెల్లింపులు (పాక్షిక చెల్లింపు) చేయవచ్చు. దీనివల్ల మీ రుణ కాలవ్యవధి తగ్గుతుంది. రుణాన్ని తీర్చడానికి తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం వల్ల మీకు ఈఎమ్ఐ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల నెలనెలా డబ్బులు ఎక్కువగా కడుతున్నప్పటికీ రుణాన్ని వేగంగా తీర్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు వడ్డీ రూపంలో చాలా సొమ్మును ఆదా చేయగలరు.

ఈ ఉదాహరణ చూడండి..

మీరు రూ.40 లక్షల గృహరుణం పొందారనుకోండి. దానికి 9.5 శాతం వడ్డీతో కలిపి 20 ఏళ్లలో చెల్లించాలని అనుకుంటున్నారు. అప్పుడు మీ ఈఎమ్ఐ రూ.37,285 ఉంటుంది. మీరు ప్రతి ఏడాది ప్రారంభంలో ఒక అదనపు ఈఎమ్ఐ చెల్లించారనుకోండి. సుమారు రూ. 11.73 లక్షలు ఆదా చేయవచ్చు. అలాగే 20 ఏళ్ల కాలపరిమితిని సుమారు 16 ఏళ్లకు తగ్గించుకోవచ్చు. మీ ఈఎమ్ఐ రూ. 37,285 అనుకున్నాం కదా. దానిని రూ. 41,014కి పెంచుకుంటే వడ్డీ చెల్లింపుల్లో దాదాపు రూ. 16.89 లక్షలను ఆదా చేస్తారు. 14 ఏళ్ల ఒక్క నెలలో అప్పు తీరిపోతుంది. మీరు ఈఎమ్ఐలు సక్రమంగా కడుతూ ఏడాదికి రూ.50 వేలు చొప్పున పాక్షిక ముందస్తు చెల్లింపు చేయడం వల్ల వడ్డీలో రూ. 14.47 లక్షల ఆదా అవుతుంది. 15 సంవత్సరాలలో రుణాన్ని క్లియర్ చేయవచ్చు.

ఈ అంశాలు మరీ ముఖ్యం..

పైన చెప్పిన అంశాలను ఆచరణలో పెడితే గృహరుణం చాలా తొందరగా తీరిపోతుంది. వడ్డీల రూపంలో డబ్బులను ఆదా చేయవచ్చు. అయితే ఈ క్రింద తెలిపిన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

  • అత్యవసర వైద్యం, అనుకోకుండా ఉద్యోగం పోవడం తదితర ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు ఆర్థికంగా కష్టాలు పడకుండా కొంత అత్యవసర నిధిని ఉంచుకోవాలి. గృహరుణాన్ని తొందరగా తీర్చాలనే ఉద్దేశంతో ఉన్న డబ్బులన్నింటినీ కట్టేస్తే అత్యవసర సమయంలో ఇబ్బంది పడతారు.
  • మీరు వివిధ పథకాలతో పెట్టుబడి పెడుతుంటారు. వాటిలోని డబ్బులను తీసి హోమ్ లోన్ కు కట్టేస్తే తొందరగా రుణం తీరిపోతుందనే ఆలోచన రావచ్చు. కానీ హోమ్ లోన్ కు కడుతున్నవడ్డీ కంటే వాటి మీద మీకు లాభం ఎక్కువ వస్తుంటే, వాటిని అలాగే ఉంచండి.
  • మీ రుణానికి అదనపు చెల్లింపులు చేసే ముందు ఏదైనా ముందస్తు చెల్లింపు జరిమానాలు ఉన్నాయో తెలుసుకోండి. రుణాన్ని ముందుగానే చెల్లిస్తే కొందరు రుణదాతలు ప్రత్యేక రుసుములు విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..