
జీవిత బీమా కొనుగోలు చేసే సమయంలో చాలా మంది మొదటగా కంపెనీ లేదా ప్రీమియం గురించి ఆలోచించినా, అసలు కీలక నిర్ణయం పాలసీ రకం ఎంపికలోనే ఉంటుంది. ప్రధానంగా బీమా ఉత్పత్తులు రెండు విభాగాలుగా ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్, ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రెండూ ఒకేలా అనిపించినప్పటికీ, వాటి లక్ష్యాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత సరళమైన బీమా విధానం. ఇందులో మీరు ఒక నిర్దిష్ట కాలానికి ప్రీమియం చెల్లిస్తారు. ఆ కాలంలో ఏదైనా అనర్థం జరిగితే మీ కుటుంబానికి బీమా మొత్తం లభిస్తుంది. ఏమీ జరగకపోతే ఎలాంటి రాబడి ఉండదు. అంటే ఇది పూర్తిగా రక్షణ కోసం మాత్రమే రూపొందించబడింది. అందుకే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ లభించడం దీని ప్రధాన ప్రయోజనం.
కుటుంబ ఆర్థిక భద్రతే మీ ముఖ్య లక్ష్యమైతే, ఇది అత్యంత సమర్థవంతమైన ఎంపికగా పరిగణించబడుతుంది. మరోవైపు సాంప్రదాయ జీవిత బీమా పాలసీలు రక్షణతో పాటు పొదుపును కూడా కలిపి అందిస్తాయి. ఎండోమెంట్ లేదా మనీ-బ్యాక్ ప్లాన్‌ల రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. పాలసీ గడువు ముగిసినప్పుడు లేదా మధ్య మధ్యలో కొన్ని మొత్తాలు తిరిగి లభిస్తాయి. అయితే ఇందులో ప్రీమియం ఒక భాగం పొదుపుకు వెళ్తుండటంతో, అదే మొత్తానికి టర్మ్ ప్లాన్‌తో పోలిస్తే కవరేజీ తక్కువగా ఉంటుంది.
ఈ రెండు మధ్య ప్రధాన తేడా వాటి ఉద్దేశ్యంలోనే ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం రిస్క్ కవరేజీ కోసం ఉండగా, సాంప్రదాయ ప్లాన్‌లు రక్షణతో పాటు స్థిరమైన రాబడిని కూడా అందించడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఆ రాబడులు సాధారణంగా తక్కువగానే ఉంటాయి, మార్కెట్ ఆధారిత పెట్టుబడులతో పోలిస్తే పెద్దగా లాభదాయకం కావు. మీ లక్ష్యం ఏమిటన్నదే సరైన ఎంపికను నిర్ణయిస్తుంది. కుటుంబానికి అధిక రక్షణ అవసరమైతే టర్మ్ ఇన్సూరెన్స్ సరైనది. ఒకేసారి బీమా, పొదుపు కలిపి కావాలనుకుంటే సాంప్రదాయ పాలసీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏది మంచిది? కంటే మీ అవసరానికి ఏది సరిపోతుంది? అన్నదే ముఖ్యమైన ప్రశ్న.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి