
విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం లాంటి కారణాలతో తమ సొంతూరిని వదిలిపెట్టి నగరాలు, పట్టణాలకు వలసలు పోతుంటారు. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ ఉంటారు. దేశంలో సుమారు 2.7 కోట్ల మంది ప్రజలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అద్దెదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చట్టాలను ప్రవేశపెట్టింది. అద్దెదారులకు అనేక హక్కులు కల్పించింది. ఈ నిబంధనలు గురించి అద్దె ఇళ్లల్లో ఉండేవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకోవాలి.
మీరు ఇల్లు అద్దెకు తీసుకుంటుంటే యజమానితో రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. అంటే లిఖితపూర్వకంగా ఒప్పదం రాసుకోవాలి. రెంట్, సెక్యూరిటీ డిపాజిట్, నోటీస్ పీరియడ్, ఇతర నిబంధనల గురించి స్పష్టంగా రాసుకోవాలి. భవిష్యత్తులో ఏమైనా వివాదాలు ఏర్పడినప్పుడు మీకు ఇవి సహాయపడతాయి. అద్దెదారుడు, యజమానికి రికార్డు తరహాలో సహాయపడుతుంది. చాలా రాష్ట్రాలు ఆన్ లైన్ ద్వారా రెంటల్ అగ్రిమెంట్ ఆప్షన్ కల్పిస్తున్నాయి. ఇక సెక్యూరిటీ డిపాజిట్ గురించి తెలుసుకోండి. అదే అడ్వాన్స్ చెల్లింపు. ఆ ప్రాంతంలో అడ్వాన్స్ ఎంత తీసుకుంటున్నారనే విషయం గురించి తెలుసుకోండి.
ఇక అద్దె పెంపు నిబంధనల గురించి ముందుగా తెలుసుకోండి. ఎన్ని నెలలకు, సంవత్సరాలకు అద్దె పెంచుతారనే విషయం గురించి అడగండి. అద్దె పెంపు ఎంత ఉంటుందనే సమాచారం తెలుసుకోండి. ఈ విషయాన్ని రెంటల్ అగ్రిమెంట్‌లో రాస్తే భవిష్యత్తులో అద్దె పెంపుకు సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండవు. ఇక ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తితే మరమ్మత్తులు, నిర్వహణ ఖర్చులు ఎవరు భరిస్తారనే విషయం గురించి తెలుసుకోండి. అద్దెదారులు, ఇంటి యజమాని మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు, అనవసరమైన వాదనలు రాకుండా ఇది నివారిస్తుంది. ఇక ఇంటిని బలవంతంగా ఖాళీ చేయమని హెచ్చరించే హక్కు యజమాని లేదు. కొన్ని నెలల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఒప్పందం గురించి తెలుసుకోండి.