కొత్త భవన నిర్మాణాలు చేపట్టేవారికి బిగ్‌ అలర్ట్‌.. బిల్డింగ్‌ రూల్స్‌లో కీలక మార్పులు!

తెలంగాణ ప్రభుత్వం 2012 బిల్డింగ్ రూల్స్‌కు కీలక సవరణలు చేస్తూ కొత్త జీవోను జారీ చేసింది. 21 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు భవనాలను హైరైజ్‌గా గుర్తించనున్నారు. 750-2000 చ.మీ. స్థలాల్లో 18-21 మీటర్ల ఎత్తు నిర్మాణాలకు టీడీఆర్ తప్పనిసరి చేశారు.

కొత్త భవన నిర్మాణాలు చేపట్టేవారికి బిగ్‌ అలర్ట్‌.. బిల్డింగ్‌ రూల్స్‌లో కీలక మార్పులు!
Building Construction

Updated on: Mar 22, 2026 | 8:16 PM

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్‌ 2012లో కీలక సవరణలు చేస్తూ కొత్త జీవోను జారీ చేసింది. పట్టణాల్లో పెరుగుతున్న నిర్మాణ అవసరాలు, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా భవనాల ఎత్తు, నిర్మాణ అనుమతులు, టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) వినియోగంపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా ఈ సవరణలు చేయబడినట్లు తెలుస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం 21 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించబడే భవనాలను హైరైజ్‌గా గుర్తించనున్నారు. ఈ మార్పు ద్వారా నగరాల్లో పెరుగుతున్న ఎత్తైన భవనాల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడానికి అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల మధ్య విస్తీర్ణం గల స్థలాల్లో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి చేశారు. దీనివల్ల భూమి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అలాగే నాన్‌ హైరైజ్‌ భవనాల విషయంలో టీడీఆర్‌ను ఉపయోగించే వారికి సెట్‌బ్యాక్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా నిర్మాణదారులకు కొంత వెసులుబాటు కల్పించడమే కాకుండా, భూమి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చే అవకాశముంది. ఇప్పటి వరకు 2012లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ, కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సవరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2016లో ప్రవేశపెట్టిన మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి.

ఈ మార్పులు రియల్‌ ఎస్టేట్ రంగానికి స్పష్టతను తీసుకురావడమే కాకుండా, పట్టణాల అభివృద్ధిని మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us