Parla Jathi Kollu: మనకు ఇప్పటి వరకూ కోళ్లు అంటే ఆహారానికి ఉపయోగించేవి .. ఇక కోడి పందాలకు ఉపయోగించేవి అని మాత్రమే తెలుసు. అయితే అందాల పోటీలో బహుమతుల కోసంకూడా కోళ్లను పెంచుతారు అన్న సంగతి తెలుసా…! అనంతరపురం జిల్లాకు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ పక్షుల మీద ప్రేమతో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. ఈ కోడి ధర ఒకటి లక్ష నుంచి ఐదు లక్షలు పలుకుతుంది. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన యల్.జయచంద్రనాయుడు వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్. ఒకవైపు విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఖాళీ సమయంలో వ్యాపకంగా స్నేహితుడు ప్రతాప్‌తో కలిసి కోళ్ల పెంపకాన్నీ చేపట్టారు. తమిళనాడు నుంచి పర్లా జాతి కోళ్లను తెచ్చి పోషిస్తున్నారు. ఒక షెడ్ ను ఏర్పాటు చేసి.. ఒక్కొక్క కోడికి ఒకో గూడు నిర్మించారు. 30 కోళ్లను సహజ పద్ధతిలో పెంచుతున్నారు. ఎందుకంటే ఈ కోడి అత్యంత కాస్ట్లీ మరి. అందుకని ఈ కోళ్లతో ఉదయాన్నే వ్యాయామం చేయిస్తారు. నీటి తొట్టెలో ఈత కొట్టిస్తారు. బాదంపిస్తా, పప్పు, సజ్జలు, జొన్నలు, రాగుల వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందిస్తారు.
ఇలా చేయడంతో పర్లా జాతి కోళ్లల్లో మంచి శరీరాకృతి.. దృఢత్వం, ఆహార్యంలో చక్కదనం వస్తుందని జయచంద్ర తెలిపారు.
దాదాపు ఆరు నెలల నుంచి ఏడాదిపాటు వీటిని పెంచిన తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతున్నారు. కోడి అందం, బరువును బట్టి ధర పలుకుతుందని చెప్పారు. కోళ్ల పెంపకందారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. అందులో కోళ్ల ఫొటోలు ఉంచుతాం. నచ్చినవారు ఫోన్ చేసి కొనుగోలు చేస్తుంటారు. పుంజు కోడి ధర రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పలుకుతుందని జయచంద్రనాయుడు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పేరుతెస్తున్న పర్లా జాతి కోళ్లు రాజసం ఉట్టిపడేలా.. అందమైన చిలుకలాంటి ముక్కు, పొడవైన తోకతో ఉంటాయి. అంతేకాదు ఈ కోళ్లను మాంసం కోసమో , పందేల కోసం కాకుండా అందాల పోటీలకు సైతం వినియోగిస్తారు. ఈ కోళ్లు పలు రకాల రంగుల్లో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక వీటి ఒకొక్క గుడ్డు ధర రూ. 1000. ఏడాదికి ఒక్కొక్క కోడి 35 గుడ్లు పెడతాయి. అంతేకాదు అందాల పోటీల్లో పాల్గొని బోలెడు బహుమతులు కూడా గెలుచుకుంటాయి.
Also Read: జీవనోపాధి పోకూడదని కోటి విలువజేసే స్థలాన్ని కొనుగోలు చేసిన చిరు వ్యాపారి ఎక్కడో తెలుసా..!