Rail Parcel App: రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్.. నేరుగా ఇంటి నుంచే పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్‌తో..

రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త. త్వరలోనే ఇంటి వద్ద నుంచే రైళ్ల ద్వారా పార్శిల్ పంపించవచ్చు. ఈ మేరకు ఓ యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే తీసుకొస్తుంది. ఈ నెల 25వ తేదీన యాప్‌ను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

Rail Parcel App: రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్.. నేరుగా ఇంటి నుంచే పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్‌తో..
Rail Parcel App

Updated on: Feb 23, 2026 | 7:00 PM

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే భారీ శుభవార్త అందించింది. ఇక నుంచి రైళ్ల ద్వారా పార్సిల్స్ పంపించవచ్చు. ఇంటి వద్దకే వచ్చి నేరుగా పికప్ చేసుకుని మీరు సెలక్ట్ చేసుకున్న అడ్రస్‌కు రైళ్ల ద్వారా డెలివరీ చేస్తారు. ఇండియాలోనే తొలిసారి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం రైల్ పార్సిల్ యాప్‌ను తీసుకొస్తున్నారు. ఈ యాప్ ద్వారా మీరు పార్సిల్ బుకింగ్ చేసుకోవడంతో పాటు డిజిటల్ విధానం పేమెంట్ చేయవచ్చు. ఇక పార్సిల్ డెలివరీ అయ్యేంత వరకు ట్రాకింగ్‌ కూడా చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ ద్వారా పార్సిల్స్ వేగవంతంగా డెలివరీ చేయవచ్చు.

ఈ నెల 25న నుంచి సేవలు

ఫిబ్రవరి 25వ తేదీన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో రైల్ పార్సిల్ లాజిస్ట్రిక్స్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రైల్ పార్శిల్ యాప్‌ను ఆయన లాంచ్ చేయనున్నారు. ఆ రోజు నుంచి ఈ యాప్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్‌లో ఈ పార్శిల్ సేవలను అందించనుండగా.. ఇక్కడ వచ్చే స్పందనను బట్టి అన్ని డివిజన్లకు విస్తరించనున్నారు. రైళ్ల ద్వారా పార్శిళ్లను వేగవంతంగా, పారదర్శకతో డెలివరీ చేస్తామని రైల్వేశాఖ చెబుతోంది. పార్శిళ్లకు భద్రత కూడా ఉంటుదని స్పష్టం చేసింది. ఈ సేవలను అమలు చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరుతో దక్షిణ మధ్య రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది.

యాప్‌లోనే అన్నీ

రైల్ పార్శిల్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవడంతో పాటు ట్రాకింగ్, డెలివరీ స్టేటస్ వంటి అన్నీ సేవలు అందుబాటులో ఉంటాయి. పార్శిల్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతీ మూమెంట్ ట్రాక్ చేయవచ్చు. ఇక పార్శిల్ ఛార్జీలను డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ విధానంలో చెల్లించవచ్చు. ఇక వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్‌క పుష్ నోటిఫికేషన్ విధానంలో పొందవచ్చు. ఇప్పటివరకు రైళ్ల ద్వారా ఏదైనా పార్శిల్ పంపాలంటే స్టేషన్‌కు వెళ్లి పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ద్వారానే బుక్ చేసుకుని పార్శిల్ పంపవచ్చు. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు వేగవంతంగా డెలివరీ చేయవచ్చు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు ఈ పార్శిల్ సేవలను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీని వల్ల తక్కువ ఖర్చుతో పార్శిల్స్ ఎక్కడికైనా పంపించవచ్చు.

Follow Us