Silver: దీపావళి తర్వాత వెండి ధరలు తగ్గుతాయా..? అసలు నిజాలు ఇవే..

ఈ ఏడాది ధన్‌తేరాస్ నాటికి వెండి ధరలు ఊహించని విధంగా ఏకంగా 98శాతం పెరిగి దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో ధర రూ.1.89 లక్షలు దాటింది. ఈ పెరుగుదలకు ముఖ్యంగా సోలార్ ప్యానెల్‌లు, ఈవీలు వంటి పరిశ్రమల డిమాండ్ కారణం. పండగ తర్వాత వెండి ధరలు తగ్గుతాయా అనేది తెలుసుకుందాం..

Silver: దీపావళి తర్వాత వెండి ధరలు తగ్గుతాయా..? అసలు నిజాలు ఇవే..
Silver Rate Prediction

Updated on: Oct 16, 2025 | 5:36 PM

గతేడాది ధన్‌తేరాస్ నుండి ఈ సంవత్సరం ధన్‌తేరాస్ నాటికి వెండి ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే వెండి ధరలు ఏకంగా 98శాతం పెరిగి, దాదాపు రెట్టింపు అయ్యాయి. గత సంవత్సరం ఒక 10 గ్రాముల వెండి నాణెం ధర సుమారు రూ.1,100 ఉండగా.. ఈ సంవత్సరం ఇది రూ.1,950కి చేరింది. బంగారం ధరల పెరుగుదలను కూడా వెండి అధిగమించింది. ప్రస్తుతం అక్టోబర్ 16 నాటికి ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో కిలో వెండి ధర రూ.1.89 లక్షలు ఉండగా, చెన్నైలో రూ.2 లక్షలు దాటింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం జరిగింది.

ధరలు పెరగడానికి ముఖ్య కారణాలు

వెండి ధరలు ఇంత భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి

పారిశ్రామిక డిమాండ్:వెండిని ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్‌ల్స్,సెమీకండక్టర్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త పరిశ్రమల డిమాండ్ వెండి ధరలను పెంచింది.

పండుగ డిమాండ్: ధన్‌తేరాస్,  వివాహాల సీజన్ ముందు కొనుగోళ్లు పెరిగాయి.

పెట్టుబడి సురక్షితం: ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి వెండిని సురక్షితమైన ఆస్తిగా కొనుగోలు చేస్తున్నారు.

రాజకీయ ఉద్రిక్తతలు: ఉక్రెయిన్ వంటి ప్రాంతాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగా కూడా పెట్టుబడిదారులు సురక్షిత లోహాల వైపు మళ్లుతున్నారు.

సమీప భవిష్యత్తులో ధరలు తగ్గుతాయా..?

దీపావళి పండుగ కొనుగోళ్లు ముగిసిన తర్వాత వెండి ధరలు స్వల్పకాలంలో తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగ డిమాండ్ తగ్గిన తర్వాత మార్కెట్ సాధారణ స్థితికి రావడం ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ సెక్యూరిటీస్‌కు చెందిన విశ్లేషకులు కూడా ఈ భారీ పెరుగుదల తర్వాత సాంకేతికంగా ధరల దిద్దుబాటు జరగవచ్చని అంగీకరిస్తున్నారు. పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడం లేదా ప్రపంచ ఉద్రిక్తతలు తగ్గడం వంటి అంశాలు ధరలను తగ్గిస్తాయి. కొంతమంది నిపుణులు 10 నుంచి 20శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలంలో అంచనా ఏమిటి..?

దీర్ఘకాలికంగా చూస్తే వెండి ధరలు మళ్లీ పెరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సారి వెండి ధర పెరుగుదల గతంలో జరిగినట్లు కేవలం పెట్టుబడిదారీ ర్యాలీ కాకుండా గ్రీన్ ఎనర్జీ, కొత్త టెక్నాలజీల నుండి వస్తున్ననిజమైన పారిశ్రామిక డిమాండ్‌పై ఆధారపడి ఉంది. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం.. 2027 నాటికి వెండి ధరలు మరింత పెరిగి కిలోకు రూ.2,46,000 వరకు చేరుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో వెండి కొరత కొనసాగుతుందని.. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి స్వల్పకాలంలో ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక పెట్టుబడికి వెండి మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..