
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది. చాలామంది వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. వాహనం తేలికగా ఉండడం, చార్జింగ్ చేసుకునే సౌలభ్యం, నగరాలలోని ట్రాఫిక్ లో సులువుగా డ్రైవింగ్ చేసే అవకాశం ఉండడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్ లోకి వచ్చి కొనుగోలుదారుల ఆదరణ పొందాయి. వాటి అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లు, అద్భుతమైన రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై సందడి చేస్తున్నాయి. అన్ని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ కార్లు పాదచారులను ఢీకొట్టే అవకాశం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ఆ వివరాలు, కారణాలను తెలుసుకుందాం. బ్రిటన్ లో రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలను నిపుణులు అధ్యయనం చేశారు. వారి పరిశీలనలో తెలిసిన విషయాలపై నివేదిక విడుదల చేశారు..దాని ప్రకారం.. పట్టణాలు, నగరాల్లో పెట్రోలు లేదా డీజిల్ వాహనాల కంటే హైబ్రిడ్ , ఎలక్ట్రిక్ కార్లు పాదచారులను ఎక్కువగా ఢీకొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి చాలా తక్కువ శబ్ధంతో ప్రయాణిస్తాయి. ఆ ధ్వనిని పాదచారులు వినలేరు. వారు పక్కకు తప్పుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ కార్లు ఎందుకు ప్రమాదకరమో నిపుణులు స్పష్టంగా తెలపలేదు. కానీ పలు కారణాలను మాత్రం వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లను యువకులే ఎక్కువగా డ్రైవ్ చేస్తారని, వారికి అనుభవం తక్కువగా ఉంటుందన్నారు. అలాగే ఈ వాహనాల శబ్ధం కూడా తక్కువగా ఉండడంతో పట్టణాలు, నగరాల్లో పాదచారులు వినడం కష్టమన్నారు. దీనిని భిన్నంగా పెట్రోలు, డీజిల్ కార్లు ఎక్కువ శబ్ధం చేస్తాయని, పాదచారులు వాటిని విని పక్కకు తప్పకుంటారని తెలిపారు.
బ్రిటన్ నిపుణుల అధ్యయనం ప్రకారం పెట్రోల్, డీజిల్ కార్ల ను దశల వారీగా రద్దు చేయబోతున్నట్లయితే ప్రభుత్వం ఈ ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ వెనుక వచ్చే కారు శబ్ధాన్ని విని పక్కకు తప్పుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్లు శబ్ధం చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. యూకే జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో పిల్లలు, యువకులు ఎక్కువగా ఉంటున్నారు. వారిలో నాలుగింట ఒకవంతు పాదచారులే.
పెట్రోల్, డీజిల్ కార్ల కంటే పాదచారులకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు 20 శాతం ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని నిపుణులు తేల్చారు. తక్కువ వేగంతో వెళ్లే సమయంలో కూడా మలుపులు, రివర్స్, ట్రాఫిక్‌లోకి వెళ్లినప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2013 నుంచి 2017 వరకు యూకేలో జరిగిన రోడ్డు ప్రమాదాలను అధ్యయనం చేశారు. వారి విశ్లేషణలో 916,713 మంది మరణించారు, అందులో 120,197 మంది పాదచారులు. 96 వేల మందిని పైగా కారు, టాక్సీ ఢీకొన్నాయి. సగటు పాదచారుల మరణాల రేటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వల్ల 5.16గా ఉండగా, పెట్రోల్, డీజిల్ కార్ల వల్ల 2.4 గా నమోదైంది.
అయితే గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాటరీ కార్లు ప్రమాదకరం కాదు. అక్కడ ప్రశాంత వాతావరణంతో పాటు ట్రాఫిక్ గోల లేకపోవడంతో ఎలక్ట్రిక్ కార్ల నుంచి తక్కువ శబ్ధం వచ్చినా పాదచారులు తప్పకునే అవకాశం ఉంది. కొత్త హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ధ్వనిని విడుదల చేసే అకౌస్టిక్ వాహన హెచ్చరిక వ్యవస్థను కలిగి ఉండాలని నిపుణులు సూచించారు. కొత్త వాటిని ఈ నిబంధనల విధించడంతో పాటు ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు ఈ వ్యవస్థ అమర్చాలన్నారు.