స్టాక్ మార్కెట్ లో కొన్ని కంపెనీలు ఆల్ టైం గ్రేట్ అనే విధంగా దూసుకుపోతుంటాయి. పెట్టుబడి దారులకు లాభాల పంట పండిస్తాయి. సాధారణంగా షేర్లలో పెట్టుబడికి దీర్ఘకాలంలో రాబడి వస్తుంది. కానీ కొన్ని షేర్లు మాత్రం స్పల్ప వ్యవధిలోనే పెట్టుబడిని పదింతలు చేస్తాయి. ప్రస్తుతం శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ షేర్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మల్టీ బ్యాగర్ స్టాక్ గా లాభాలను తెచ్చిపెట్టుతున్నాయి. కేవలం ఆరు నెలల్లోనే 221 శాతం పెరిగాయి. త్వరలో వాటాదారులకు బోనస్ జారీ చేస్తామని కంపెనీ తెలపడం కూడా షేర్ పెరుగుదలకు కారణమైంది.
శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ షేర్లు సోమవారం ఐదు శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో స్క్రిప్ రూ. 4295.45 వద్ద స్థిరపడింది. ముందు రోజు ముగింపు రూ. 4090.95 వద్ద ఉంది. స్క్రిప్ ఒక్కో షేరుపై గరిష్టంగా రూ.4295.45, కనిష్టంగా 3915కు చేరింది. రాబోయే బోర్డు సమావేశంలో బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనను పరిశీలిస్తామని కంపెనీ ప్రకటించిన తర్వాత స్టాక్ ధరలో పెరుగుదల నెలకొంది. ఈ బోనస్ ఇష్యూ అనేది కార్పొరేట్ చర్య, దీనిలో కంపెనీ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ముందుగా నిర్ణయించిన నిష్పత్తిలో వాటాదారులకు ఉచిత షేర్లను అందిస్తుంది. వీటిని 5:1 నిష్పత్తిలో ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన చేసింది. 2024 అక్టోబర్ 7న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సబ్ మెర్సిబుల్, సోలార్, ప్రెజర్ బూస్టర్, వ్యవసాయం పంపులను తయారు చేస్తుంది. వీటిని ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ అవసరాల కోెసం ఉపయోగిస్తారు. ఈ కంపెనీ నుంచి దాదాపు వంద దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.
శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో రూ. 555.05 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ సమయంలో నికర లాభం రూ.90.49 కోట్లు సంపాదించింది. ఫైనాన్సియల్ ఇయర్ 25లోని ప్రథమ త్రైమాసికంలో ప్రతి షేరుకు ఆదాయం (ఈపీఎస్)రూ. 45.17గా ఉంది. ప్రతి స్టాక్‌పై కంపెనీ ఎంత డబ్బు సంపాదిస్తుంది అనే విషయాన్ని ఈపీఎస్ సూచిస్తుంది.
శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ స్టాక్స్ కు సంబంధించి ఏడాది, మూడూ, ఐదేళ్ల రాబడి వరసగా 399.33, 512, 1390 శాతంగా ఉన్నాయి. ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ గా అధిక రాబడిని అందిస్తోంది. ఇయర్ టు డేట్ ప్రాతిపదికన 2024లో స్టాక్‌లు 316 శాతం పెరిగాయి
కంపెనీలు తమ షేర్లను కొన్నవారికి, వాటి సంఖ్యను బట్టి లాభంలో కొంత శాతాన్ని అందిస్తాయి. దాన్నే డివిడెంట్ అంటారు. శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ 2024 సెప్టెంబర్ 23న ఎక్స్-డేట్‌తో ఒక్కో షేరుకు రూ. 4 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 9న ఒక్కో షేరుకు రూ.2 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..