SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఇక ఛార్జీలు బాదుడే..

ఇప్పటివరకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫ్రీ అనుకున్న కొన్ని సేవలకు ఎస్బీఐ ఇప్పుడు ముగింపు పలికింది. ముఖ్యంగా అత్యవసర నగదు బదిలీ కోసం మనం వాడే IMPS నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీలు ఎప్పటినుంచి అమల్లోకి రానున్నాయి..? అసలు ఏయే లావాదేవీలపై ఎంత భారం పడనుంది? అనేది తెలుసుకుందాం..

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఇక ఛార్జీలు బాదుడే..
Sbi Imps Rules Change

Updated on: Feb 07, 2026 | 11:28 AM

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ ద్వారా జరిపే నగదు బదిలీల పై ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును రద్దు చేస్తూ.. కొత్త ఛార్జీలను ఖరారు చేసింది. ఈ సవరించిన నిబంధనలు ఫిబ్రవరి 15, 2026 నుండి అధికారికంగా అమలులోకి రానున్నాయి. సాధారణంగా అత్యవసరంగా డబ్బులు పంపాల్సి వచ్చినప్పుడు లేదా యూపీఐ పరిమితి దాటినప్పుడు వినియోగదారులు ఐఎంపీఎస్ విధానాన్ని ఎంచుకుంటారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వంటి డిజిటల్ ఛానెళ్ల ద్వారా చేసే భారీ లావాదేవీలపై ఎస్‌బీఐ నామమాత్రపు రుసుములను విధించింది. ఈ నిర్ణయం ద్వారా బ్యాంక్ తన డిజిటల్ మౌలిక సదుపాయాల ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.

ఛార్జీలు ఇలా

కొత్త ఛార్జీల వివరాల ప్రకారం.. రూ. 25,000 వరకు చేసే నగదు బదిలీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది సామాన్యులకు పెద్ద ఊరట. అయితే రూ. 25,001 నుంచి లక్ష రూపాయల వరకు జరిపే లావాదేవీలకు రూ.2 ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తారు. అదేవిధంగా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ. 6 ప్లస్ జీఎస్‌టీ, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు భారీ మొత్తాన్ని పంపిస్తే రూ. 10 ప్లస్ జీఎస్‌టీ సర్వీస్ ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు బ్యాంక్ బ్రాంచులకు వెళ్లి నేరుగా ఐఎంపీఎస్ లావాదేవీలు చేసే వారికి పాత ఛార్జీలే వర్తిస్తాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అక్కడ పంపే నగదును బట్టి రూ.2 నుంచి రూ. 20 వరకు వసూలు చేస్తారు. కొన్ని ప్రత్యేక కేటగిరీల ఖాతాదారులకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. ముఖ్యంగా డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే, పోలీస్ విభాగాలకు చెందిన శాలరీ అకౌంట్లు ఉన్నవారికి, అలాగే శౌర్య ఫ్యామిలీ పెన్షన్, ఎస్‌బీఐ రిష్టే ఖాతాదారులకు ఐఎంపీఎస్ సేవలు ఎప్పటిలాగే ఉచితంగా అందుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్లపై తక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ద్వారా బ్యాంక్ తన సేవలను మరింత మెరుగుపరుచుకోనుంది. ఎస్‌బీఐ కస్టమర్లు తమకు అవసరమైన భారీ లావాదేవీలను ఫిబ్రవరి 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవడం ద్వారా ఈ కొత్త ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి