వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రస్తుతం బ్యాంకులు పోటీపడుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చే ఆఫర్లకు ధీటుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అప్డేట్ అవుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై డెబిట్ కార్డుతో ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.
ఇప్పటి వరకు కేవలం క్రెడిట్ కార్డుల ద్వారానే వస్తువులను కొనుగోలు చేసినప్పుడు.. వాయిదా పద్దతి పెట్టుకునే అవకాశం ఉండేది. డెబిట్ కార్డుల ద్వారా ఈ సౌకర్యం ఉండేది కాదు. తాజాగా ఎస్బీఐ ప్రకటించిన ఈ ఆఫర్‌తో ఇక డెబిట్ కార్డు ఉన్న వినియోగదారులు క్రెడిట్ కార్డు లేదన్న లోటును తీర్చుకోవచ్చు. ఏవైనా వస్తువులు డెబిట్ కార్డును ఉపయోగించి కొన్న సమయంలో మొత్తం చెల్లించకుండా సులభ వాయిదా పద్దతులు పెట్టుకునేలా సదుపాయాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది.
ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా వస్తువులు కొంటే.. ప్రస్తుతం 6 నుంచి 18 నెలల వరకు ఈఎంఐ పెట్టుకునే సదుపాయం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1500కు పైగా నగరాలు, పట్టణాల్లో ఉన్న 40వేలకు పైగా మర్చంట్లు, స్టోర్స్‌లో ఎస్‌బీఐ వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక కస్టమర్లకు సంబంధించిన ఆర్థిక స్థితి, క్రెడిట్ హిస్టరీని బట్టి డెబిట్ కార్డు ఈఎంఐ లిమిట్ అందివ్వనున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు 567676 నంబర్‌కు DCEMI అని తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపిస్తే..ఈ సదుపాయానికి అర్హులవుతారో, కారో తెలుసుకోవచ్చు. అలాగే తమకు కేటాయించబడిన క్రెడిట్ లిమిట్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.