Royal Enfield Bikes: సూపర్ ఫీచర్స్‌తో బుల్లెట్ బండి ఈవీ వెర్షన్.. విడుదల ఎప్పుడంటే..?
తెలుగు రాష్ట్రాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను బుల్లెట్ బండి అని ముద్దుగా పిలుచుకుంటారు. తమ హోదాను నలుగురిలో చూపించుకోవడానికి చాలా మంది ఈ బైక్స్‌ను వాడుతూ ఉంటారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్‌లో కొత్త బైక్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీని తన శ్రేణిలోని మొదటి మోడల్ అయిన సీ6 తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో విడుదల చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సీ-6 పేరుతో పరిచయం చేయనున్నారు. కొత్త ఈవీ బ్రాండ్‌కు సంబంధించిన కార్యకలాపాలు, డీలర్‌షిప్ నెట్‌వర్క్‌పై బ్రాండ్ ఇంకా కొంత స్పష్టత ఇవ్వలేదు. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఈఐసీఎంఏలో మొదటిసారి కనిపించింది. అప్పటి నుంచి ఈ టెస్ట్ మ్యూల్ వివిధ సందర్భాల్లో ట్రయల్స్‌లో కనిపిస్తుంది. ఈ ట్రాయల్స్‌లో బ్రాండ్‌కు సంబంధించిన రెట్రో, లెటెస్ట్ లుక్స్‌ను ప్రతిబింబించేలా ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మోటర్ సైకిల్ అల్యూమినియం ఛాసిస్, గిర్డర్ ఫోర్క్‌లతో సన్నని ఫ్రేమ్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ బైక్ వింటేజ్ బైక్‌లను గుర్తుకు తెస్తుంది. అదనంగా స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ సీ-6 స్ట్రీమ్‌లైన్డ్ బాడీ గాలి ప్రవాహాన్ని నియంత్రించే మెగ్నీషియం కేసింగ్‌తో ఉంటుంది. అయితే ఈ బైక్ స్పెసిఫికేషన్లు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే ముఖ్యంగా ఈ ఈవీ బైక్ పట్టణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ సుమారు 100 కి.మీ పరిధిని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించారు. అలాగే బరువు కూడా కేవలం 100 కిలోలు ఉండేలా డిజైన్ చేశారు.
ముఖ్యంగా లుక్స్ పరంగా ఈ బైక్ యువతను అమితంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తి శ్రేణి అధునాతన ఫీచర్లతో కూడిన మొదటి మోటార్‌సైకిల్‌గా దీనిని పరిగణించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఈ బైక్ వాయిస్ కంట్రోల్, కనెక్టివిటీ, మరిన్ని వంటి అనేక విధులను సులభతరం చేసే రౌండ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఈ టచ్ స్క్రీన్ పని చేయడానికి రాయల్ ఎన్‌పీల్డ్ కంపెనీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఆవిష్కరణ సందర్భంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మారియో అల్విసి మాట్లాడుతూ ఈ మోటార్‌సైకిల్ అత్యంత అత్యాధునిక లక్షణాలతో యువతను ఆకర్షిస్తుందని స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




