
సైబర్ నేరాల వంటి ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందులో భాగంగా 18 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం కంపెనీలు డిస్‌కనెక్ట్ చేసే అవకాశం ఉంది. మొబైల్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న అనేక ఉదంతాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఎకనామిక్ టైమ్స్ వార్తాపత్రికలోని ఒక నివేదిక ప్రకారం, దుర్వినియోగం అయ్యే మొబైల్ కనెక్షన్‌లను రద్దు చేయాలని టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది .
‘సమగ్ర విచారణలో ఒకే హ్యాండ్‌సెట్‌లో వేల సంఖ్యలో మొబైల్ కనెక్షన్‌లు ఉపయోగించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని ఒక అధికారి ఈ నివేదికలో తెలిపారు. ఈ నివేదిక ప్రకారం.. మే 9న కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ 28,220 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను డిస్‌కనెక్ట్ చేయాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు ఉపయోగించే 20 లక్షల సిమ్‌లను రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది.
అటువంటి సందర్భాలలో10 శాతం మాత్రమే సిమ్‌లను ధృవీకరించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పుడు నిఘాలో ఉన్న 20 లక్షల సిమ్‌లలో 10% మొబైల్ కనెక్షన్‌లు మాత్రమే ధృవీకరించనున్నారు. దీంతో సుమారు18 లక్షల మొబైల్ నంబర్లను డిస్‌కనెక్ట్ చేయవచ్చు. టెలికాం కంపెనీలు ఈ నంబర్ల రీవెరిఫికేషన్‌ను పక్షం రోజుల్లో పూర్తి చేయనున్నాయి. ఆ తర్వాత అన్ వెరిఫైడ్ నంబర్లు డిస్‌కనెక్ట్ అవుతాయి’ అని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం.. 2023లో ఆన్‌లైన్ ఆర్థిక మోసం కారణంగా ప్రజలు రూ.10,319 కోట్లు కోల్పోయారు. ఆ ఏడాది దాదాపు ఏడు లక్షల ఫిర్యాదులు నమోదైన సంగతి తెలిసిందే.
మోసగాళ్లు చాలా తెలివిగా సిమ్ కార్డులను హ్యాండిల్ చేస్తారు. ఒక టెలికాం సర్కిల్‌కు చెందిన సిమ్ కార్డును మరొక టెలికాం సర్కిల్‌లో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, బెంగళూరులో మధ్యప్రదేశ్ సర్కిల్ సిమ్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
మోసగాళ్లు ఒకే సిమ్ కార్డ్‌ని వేర్వేరు హ్యాండ్‌సెట్‌లలో ఉపయోగిస్తారు. ఈ ఫిర్యాదుదారులు సిమ్ కార్డ్‌లు, హ్యాండ్‌సెట్‌లను మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకే మొబైల్ హ్యాండ్‌సెట్ నుండి మోసపూరిత కాల్ వస్తే వాటిని త్వరగా గుర్తించవచ్చు. ఉదాహరణకు, ఒక హ్యాండ్‌సెట్ నుండి కొన్ని మొబైల్ కాల్‌లు చేసిన తర్వాత, మీరు కాల్ చేయడానికి సిమ్‌ని తీసివేసి మరొక హ్యాండ్‌సెట్‌లో ఉంచవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి