Jio Mart Express: క్విక్ కామర్స్‌లోకి జియో మార్ట్.. కేవలం 90 నిమిషాల్లోనే డెలివరీ.. ఇప్పటికే అక్కడ ప్రారంభం..

|

Jun 04, 2022 | 7:28 PM

Jio Mart Express: ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా ఆన్ లైన్ పైనే చాలా మంది ఆదారపడుతున్నారు. అందులోనూ సేవలు వేగంగా అందుబాటులోకి రావటం అందరినీ ఇటు వైపుకు ఆకర్షిస్తోంది.

Jio Mart Express: క్విక్ కామర్స్‌లోకి జియో మార్ట్.. కేవలం 90 నిమిషాల్లోనే డెలివరీ.. ఇప్పటికే అక్కడ ప్రారంభం..
Jio Mart
Follow us on

Jio Mart Express: ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా ఆన్ లైన్ పైనే చాలా మంది ఆదారపడుతున్నారు. అందులోనూ సేవలు వేగంగా అందుబాటులోకి రావటం అందరినీ ఇటు వైపుకు ఆకర్షిస్తోంది. ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకునేందుకు దిగ్గజ కంపెనీలు సైతం ఇప్పుడు సిద్ధమౌతున్నాయి. వేగంగా సేవలు కావాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో.. దానిని లాభాలుగా మార్చుకునేందుకు రిలయన్స్ రిటైల్ ముందడుగు వేసింది. ఇందుకోసం జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను ప్రయోగాత్మకంగా ఇటీవలే నవీ ముంబై నగరంలో కంపెనీ పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి JioMart సేవలు అందిస్తున్న 200పైగా నగరాలకు ఈ ఎక్స్‌ప్రెస్ సేవను విస్తరించాలని యోచిస్తోంది. కేవలం 90 నిమిషాల్లో డెలివరీ చేయటంతో పాటు.. కనీసం రూ.199 విలువైన ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేస్తున్నట్లు సమాచారం.

దీనితో రిలయన్స్ రిటైల్.. Zomato కంపెనీకి చెందిన Blinkit, Instant, Zepto, Swiggy Instamart, Tata కంపెనీకి చెందిన Big Basket, Ola Dashలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఇందుకోసం జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ డన్జో డెలివరీ ఫ్లీట్ ను, స్థానిక కిరానా స్టోర్‌లను హైపర్‌లోకల్ హబ్‌లుగా ఉపయోగిస్తుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయితే.. జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి సరకుల సరఫరా జరుగుతుందని ఇతర నివేదికలు చెబుతున్నాయి. మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్విక్ కామర్స్ విషయంలో రిలయన్స్ రిటైల్ వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నవీ ముంబైలోని పైలట్ గా కిరాణా, వ్యక్తిగత, గృహ సంరక్షణ ఉత్పత్తులతో సహా రెండు వేలకు పైగా SKUలను కవర్ చేస్తోంది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిటైల్ దిగ్గజం స్మార్ట్‌ఫోన్‌లతో సహా మందులు, చిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి ఇతర విభాగాల్లో పనిచేయాలని యోచిస్తోంది. వేగంగా సేవలను అందించటంలో కబీర్ బిస్వాస్ నేతృత్వంలోని డన్జోకు కంపెనీ ఇప్పటికే మద్దతునిస్తోంది. ఈ స్టార్టప్ జూన్ 2021లోనే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో డన్జో డైలీ సేవలను ప్రారంభించింది. కిరాణా, మాంసం, పెంపుడు జంతువుల సామాగ్రి, మందులు మొదలైన వాటిని ఇప్పటికే అందిస్తోంది.

వ్యాపార విస్తరణకు అనువుగా ఇప్పటికే Dunzoతో పాటు.. ఫార్మసీ స్టార్టప్ నెట్‌మెడ్స్, డ్రోన్ స్టార్టప్ ఆస్టెరియా, deeptech స్టార్టప్ Tesseract, Just Dial, ఆన్‌లైన్ ఫర్నిచర్ స్టార్టప్ అర్బన్ లాడర్, లాజిస్టిక్స్ స్టార్టప్ గ్రాబ్ ఎ గ్రబ్, edtech Embibeతో పాటు ఇతరాల్లో వ్యూహాత్మకంగా రిలయన్స్ ఇప్పటికే పెట్టుబడి పెట్టింది. హైబ్రిడ్ ఆఫ్‌లైన్-టు-ఆన్‌లైన్ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే కంపెనీ ప్రణాళికలో ఇది భాగమని తెలుస్తోంది. దేశంలో ఐదు వేలకు పైగా నగరాల్లో కంపెనీ అనేక మంది యాక్టివ్ యూజర్ బేస్ ను కలిగి ఉంది.