
RBI: భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్లలో మరోసారి భారీ మార్పులు చోటుచేసుకోవచ్చు. నగదుకు పెరుగుతున్న డిమాండ్, నోట్ల ముద్రణ ఖర్చు పెరుగుతున్న దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్లాస్టిక్ లేదా పాలిమర్ ఆధారిత కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల జరిగిన ఆర్‌బిఐ బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్ల అంశంపై చర్చ జరిగింది. ఈ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయని, ఎక్కువ కాలం పాటు క్షీణతను నిరోధిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల ముద్రణ చలామణి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
పాలిమర్ కరెన్సీ నోట్లను ఒక ప్రత్యేక రకమైన ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఈ రకమైన నోట్లను ప్లాస్టిక్ మనీ లేదా ప్లాస్టిక్ నోట్లు అని పిలుస్తారు. వీటిలో ప్రధానంగా బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలిప్రొపైలిన్ (BOPP) అనే సింథటిక్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. ఈ నోట్లు పలుచగా, సరళంగా, బలంగా ఉంటాయి. ఇంకా సాధారణ కాగితపు నోట్ల వలె అంత సులభంగా చిరగవు లేదా పాడైపోవు. ఈ నోట్లలో మెరుగైన భద్రతా ఫీచర్లు కూడా ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు కూడా పాలిమర్ ఆధారిత కరెన్సీ నోట్లను జారీ చేయగలవు.
ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణపై రూ.6,372.8 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అంతకు ముందు సంవత్సరం ఈ ఖర్చు రూ.5,101.4 కోట్లుగా ఉంది. పెరుగుతున్న నగదు డిమాండ్ కారణంగా నోట్ల ముద్రణ వ్యయం క్రమంగా పెరుగుతోందని 2025 రిజర్వ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
అంతేకాకుండా చాలా కాగితపు నోట్లు త్వరగా పాడైపోతాయి. 2025 నాటికి లక్షలాది పాడైన కాగితపు నోట్లను రద్దు చేయాల్సి ఉండగా, వాటిలో అత్యధిక సంఖ్యలో 500, 100 రూపాయల నోట్లు ఉన్నాయి. అందువల్ల ఎక్కువ కాలం మన్నిక ఉండే పాలిమర్ నోట్లను ఒక మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. పాలిమర్ నోట్లు ఇప్పటికే అనేక దేశాల్లో చెలామణిలో ఉన్నాయి.
భారతదేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలనే ఆలోచన కొత్తది కాదు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అటువంటి నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కానీ సాంకేతిక కారణాల వల్ల దానిని అమలు చేయలేకపోయారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలలో పాలిమర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. 1988లో ఆస్ట్రేలియా వీటిని మొట్టమొదట ప్రవేశపెట్టింది. అప్పటి నుండి కెనడా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, రొమేనియా వంటి దేశాలు వీటిని స్వీకరించాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఇదే బాటలో నడవాలని యోచిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి