RBI: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. GDP వృద్ధి 7.2 శాతంగా అంచనా..

|

Apr 08, 2022 | 12:45 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు(Interest Rates)ను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది...

RBI: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. GDP వృద్ధి 7.2 శాతంగా అంచనా..
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు(Interest Rates)ను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) మాట్లాడుతూ కరోనా సంక్షోభం ప్రారంభమైన తొలినాళ్లలో ద్రవ్యలభ్యత కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన సర్దుబాటు చేశామన్నారు. అయితే, ఈసారి సర్దుబాటు ఉపసంహరణ వైఖరికి మారుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొనడం గమనార్హం.

మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టం చేసింది. దేశీయంగా ఇంధన, కమొడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. మునుపటి అంచనా 7.8 శాతం నుంచి 2022-2023కి నిజమైన GDP వృద్ధి 7.2 శాతంగా అంచనా వేశామని శక్తికాంత దాస్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం అంతకుముందు 4.5 శాతం నుండి FY23కి 5.7 శాతంగా అంచనా వేశామని RBI గవర్నర్ వివరించారు.

తాజా ఆర్థిక సంవత్సరంలో సగటున 5.7 శాతం ద్రవ్యోల్బణం కొనసాగనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది. ఏప్రిల్‌-జూన్‌లో 6.3%, జులై-సెప్టెంబరులో 5%, అక్టోబరు-డిసెంబరులో 5.4%, జనవరి-మార్చిలో 5.1% ఉండనున్నట్లు పేర్కొంది. సురక్షిత, భద్రతతో కూడిన చెల్లింపు వ్యవస్థను ప్రోత్సహించే దిశగా అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంలలో కార్డురహిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Read Also.. Sugar: భారీగా పెరిగిన చక్కెర ఎగుమతి.. ఇప్పటికే 58.10 లక్షల టన్నుల తరలింపు..