
పబ్లిక్ హాలీడేస్‌తో పాటు రెండో, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో దేశంలోని బ్యాంకులన్నీ మూసివేసి ఉంటాయనే విషయం తెలిసిందే. ఆర్బీఐ ముందుగానే రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను పరిగణలోకి తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. దీంతో వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవులు వేరుగా ఉంటాయి. ఇక పబ్లిక్ హాలీడేస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. పరిస్థితిని బట్టి బ్యాంక్ సెలవుల్లో ఆర్బీఐ మధ్యలో మార్పులు చేయవచ్చు. తాజాగా ఆర్బీఐ బ్యాంకు సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సూచనలో బ్యాంకు సెలవుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా బ్యాంకు సెలవుల్లో చోటుచేసుకున్న మార్పులేంటి..? ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది..? అనే ఈ వివరాలు ఒకసారి చూద్దాం.
మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ పనిచేయనున్నాయి. ఆ రోజున మహావీర్ జయంతి ఉండటంతో గతంలో జారీ చేసిన హాలీడేస్ లిస్ట్ ప్రకారం బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ సెలవును రద్దు చేసిన ఆర్బీఐ.. ఆ రోజున బ్యాంకులు యధావిధిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మార్చిలో మహావీర్ జయంతితో సహా మొత్తం 11 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న క్రమంలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపు లావాదేవీలను నిర్వహించే బ్యాంక్ శాఖలను మార్చి 31న తెరిచి ఉంచాలని ఆర్బీఐని కేంద్రం కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనతో మార్చి 31న దేశంలోని బ్యాంకులన్నీ తెరిచి ఉంచాలని ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోనే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ప్రతీ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో నమోదు కావాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. దీంతో ప్రభుత్వ వ్యాపారంతో అనుసంధానించబడ్డ శాఖలు మార్చి 31న ఎప్పటిలాగే కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. కానీ కస్టమర్లు బ్రాంచ్‌ను సందర్శించేముందు ఒకసారి సిబ్బందితో ధృవీకరించుకుంటే మంచిది.
ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకారం మార్చిలో 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 2న హోలికా దహన్, మార్చి 3న హోలీ, మార్చి4న హోలీ రెండో రోజు, మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 26న శ్రీరామనవమి, మార్చి 27న శ్రీరామ దావిన్ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
ఫిబ్రవరి 18న లోసర్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులు పనిచేయవు. ఇక ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు. ఇక ఫిబ్రవరి 20న మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్యాంకులను మూసివేయనున్నారు.