
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. తత్కాల్ టిక్కెట్లు మరింత వేగంగా బుక్ కానున్నాయి. ఇప్పటివరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవాలంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్ డౌన్ అవ్వడం, స్లోగా ప్రాసెస్ అవ్వడం లాంటి సమస్యలు రావడం వల్ల ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోలేకపోతున్నారు. దీంతో టికెట్లను వేగంగా ప్రయాణికులు బుక్ చేసుకునేలా కొత్త ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను ఐఆర్‌సీటీసీ తీసుకొస్తుంది. ఈ కొత్త వ్యవస్థ నిమిషానికి 1,25,000 టిక్కెట్లు ఒకేసారి బుక్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుత ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ నిమిషానికి 25,000 టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంది. దీనిని ఇప్పుడు మెరుగుపరుస్తున్నారు.
కొత్త వ్యవస్థతో టిక్కెట్ బుకింగ్ వేగం ఒకేసారి ఐదు రెట్లు పెరుగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వేశాఖకు సంబంధించిన సాంకేతిక విభాగమైన క్రిస్ ఈ కొత్త రిజర్వేషన్ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఈ కొత్త సిస్టమ్‌తో టిక్కెట్లు బుకింగ్ సులభం అవుతుంది. దీని వల్ల సామాన్య ప్రయాణికులకు వేగంగా టికెట్లు బుక్ అవుతాయి. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసే సమయంలో ప్రతిరోజూ ఉదయం 10, 11 గంటలకు సర్వర్‌పై అధిక భారం పడుతుంది. దీనివల్ల తరచుగా యాప్ హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ కొత్త వ్యవస్థలో ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా టిక్కెట్లు లభిస్తాయని రైల్వేశాఖ చెబుతోంది.
క్రిస్ గత 40 సంవత్సరాలుగా రైల్వేలను డిజిటలైజేషన్‌లో సహాయపడుతుంది. ఈ సంస్థ టికెటింగ్ వ్యవస్థలు, సరుకు రవాణా రైలు కార్యకలాపాలతో పాటు రైల్వేలకు సంబంధించి ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేసింది. కాలంతో పాటు వీటిని అధునీకరిస్తోంది. అయితే ఇటీవల రైల్వేశాఖ ‘రైల్‌వన్’ యాప్‌లో అన్నీ సేవలను అందిస్తోంది. ఇప్పుడు ఈ యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ తీసుకురాబోతుంది. దీని సహాయంతో ప్రయాణికులకు ఇప్పుడు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించబడతాయి. తత్కాల్ టికెట్ కన్ఫార్మ్ అవుతుందా.. వెయిటింగ్ టికెట్ కన్పార్మ్ అయ్యే ఛాన్స్‌లు ఎలా ఉన్నాయనేది ఏఐ అంచనా వేసి ఖచ్చితంగా చెబుతుంది. దాదాపు 90 శాతం ఖచ్చితత్వంతో సమాచారం అందిస్తుంది. దీని వల్ల ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. రైల్ వన్ యాప్‌లో త్వరలోనే ఈ ఫీచర్ రానుంది. ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉండటం వల్ల ప్రయాణికులు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో ఈ సమస్య త్వరలో తొలగిపోనుంది.