
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇరాన్ దాడుల కారణంగా ఖతర్ LNG ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్-కాబీ ప్రకారం దేశం మొత్తం LNG ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 17 శాతం తగ్గుదల నమోదై, ఏటా దాదాపు 20 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితి మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు కొనసాగవచ్చని ఆయన హెచ్చరించారు.
ఇటీవల జరిగిన దాడుల్లో ఖతార్‌కు చెందిన 14 LNG ఉత్పత్తి యూనిట్లలో కనీసం రెండు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీ వద్ద జరిగిన క్షిపణి దాడి పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో ఖతార్ తన LNG సరఫరాలపై ఫోర్స్ మేజర్ ప్రకటించాల్సి వచ్చింది, అంటే ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తోంది.
ఈ అంతరాయం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇండియా, చైనా, ఇటలీ, బెల్జియం, సౌత్ కొరియా వంటి దేశాలు ఖతార్ LNGపై ఆధారపడినవే. ముఖ్యంగా భారత్ తన సహజ వాయువు అవసరాలలో సుమారు 20 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుండటంతో, దేశీయంగా LPG ధరలు, సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. LNG మాత్రమే కాకుండా, కండెన్సేట్ (24 శాతం), LPG (13 శాతం), హీలియం (14 శాతం), నాఫ్తా, సల్ఫర్ ఉత్పత్తులు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ప్రభావం భారతదేశంలోని రెస్టారెంట్లలో LPG వినియోగం నుంచి, దక్షిణ కొరియాలో చిప్ తయారీ పరిశ్రమలో హీలియం వినియోగం వరకు విస్తరించనుంది. మొత్తంగా ఈ పరిణామాలు గ్లోబల్ ఇంధన మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతూ, గల్ఫ్ ప్రాంత స్థిరత్వంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి