ప్రతి సెకన్‌కు రూ.62 వేల లాభం! ఎవరికో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించి చరిత్ర సృష్టించాయి. మెరుగైన ఆస్తి నాణ్యత, ఆరోగ్యకరమైన రుణ విస్తరణ, పెరిగిన ఆదాయం ఈ విజయానికి ప్రధాన కారణాలు. స్థూల నిరర్థక ఆస్తులు చారిత్రకంగా తగ్గుముఖం పట్టాయి.

ప్రతి సెకన్‌కు రూ.62 వేల లాభం! ఎవరికో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
Public Sector Banks

Updated on: May 12, 2026 | 10:11 PM

ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధికంగా రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించాయి. వరుసగా నాలుగో ఏడాది కూడా పీఎస్‌బీలు లాభదాయకంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి సెకనుకు రూ.62 వేలకుపైగా లాభం ఆర్జించాయని వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు దేశ బ్యాంకింగ్ రంగ బలోపేతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం మెరుగైన ఆస్తి నాణ్యత, ఆరోగ్యకరమైన రుణ విస్తరణ, పెరిగిన ఆదాయం ఈ భారీ లాభాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. 2025-26లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం నిర్వహణ లాభం రూ.3.21 లక్షల కోట్లకు చేరుకోగా, నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

2026 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం రూ.283.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాదిలో 12.8 శాతం వృద్ధిని సూచిస్తోంది. అదే సమయంలో మొత్తం డిపాజిట్లు 10.6 శాతం పెరిగి ₹156.3 లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్రజల విశ్వాసం ప్రభుత్వ బ్యాంకులపై మరింత బలపడినట్లు సూచిస్తోంది. మరోవైపు రుణాల పంపిణీ కూడా గణనీయంగా పెరిగింది. మొత్తం రుణాలు 15.7 శాతం వృద్ధితో రూ.127 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యక్తిగత రుణాలపై డిమాండ్ పెరగడం దీనికి కారణంగా భావిస్తున్నారు.

ఆస్తుల నాణ్యతలో కూడా ప్రభుత్వ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయి. స్థూల నిరర్థక ఆస్తుల (GNPA) నిష్పత్తి 1.93 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల (NNPA) నిష్పత్తి 0.39 శాతానికి తగ్గింది. ఇది చారిత్రాత్మకంగా అత్యల్ప స్థాయిగా పేర్కొంటున్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు 90 శాతానికి పైగా ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియోను కొనసాగించడం, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు బలపడినట్లు సూచిస్తోంది. ఇక 2025-26లో కొత్త స్లిప్పేజీలు కూడా తగ్గుముఖం పట్టాయి. స్లిప్పేజ్ రేషియో 0.7 శాతానికి పడిపోగా, రద్దు చేసిన ఖాతాల నుంచి కూడా రూ.86,971 కోట్ల రికవరీలు సాధించాయి. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల రికవరీ వ్యవస్థలు, క్రెడిట్ క్రమశిక్షణ మరింత మెరుగుపడినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us