Metro Services: దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో వచ్చేసింది.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. అబ్బురపరిచే సౌకర్యాలు ఇవే..

ప్రధాని మోదీ యూపీలోని మీరట్‌లో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో, నమో భారత్ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మెట్రోలో ప్రయాణించారు. నమో భారత్ రైలు వల్ల మీరట్-ఢిల్లీ మధ్య గంట ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది.

Metro Services: దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో వచ్చేసింది.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. అబ్బురపరిచే సౌకర్యాలు ఇవే..
Metro

Updated on: Feb 22, 2026 | 4:25 PM

భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. మీరట్ సౌత్ నుంచి మోడీపురం వరకు ఈ మెట్రో నడుస్తోంది. ఈ హైస్పీడ్ మెట్రో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దేశంలోని ఇప్పటివరకు ఉన్న మెట్రో సర్వీసుల్లో అత్యంత వేగవంతమైన మెట్రో ఇదేనని చెప్పవచ్చు. వేగవంతమైన ప్రయాణంతో పాటు సమర్థవంతమైన హైస్పీడ్ ఇంటర్‌సిటీ ప్రయాణాన్ని ఇది అందిస్తుంది. 12 స్టేషన్ల మీదుగా 21 కిలోమీటర్ల కారిడార్‌లో ఇది ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎయిర్ కండీషన్డ్  కోచ్‌లు మూడు ఉండగా.. ఆకుపచ్చ, నీలం, నారింజ రంగుల్లో తేలికైన స్టెయిన్ లెస్ స్టీల్ డిజైన్లను ఇవి కలిగి ఉంటాయి. సీటీటీవీ, యూఎస్‌బీ పోర్ట్, ఆధునిక రైలు ఆటోమేషన్ వ్యవస్థ, పునరుత్పత్తి బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఇది కలిగి ఉంది.

ఎంతమంది ప్రయాణించవచ్చంటే..?

ఈ మెట్రో రైళ్లల్లో ఒకేసారి 700 మంది ప్రయాణం చేయవచ్చు. వీటిల్లో 173 సీట్లు అందుబాటులో ఉంటాయి. మహిళలు, వృద్దులు, వికలాంగులకు ప్రత్యేకమైన రిజర్వ్‌డ్ సీట్లు ఉంటాయి. ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. రవాణా పెరుగుదల, సమర్థవంతమైన పట్టణ ప్రయణంతో పాటు వేగవంతమైన ఇంటర్ సిటీ కదిలికలకు ఈ మెట్రో ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. రోడ్డు రద్దీని తగ్గించడం, వాహన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు.

నమో భారత్ సేవలు ప్రారంభం

అటు మెట్రో పాటు నమో భారత్ సేవలను కూడా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్‌ను సందర్శించిన మోదీ.. ఇక్కడ మెట్టమొదటి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ప్రారంభించారు. దాదాపు రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించారు. మీరట్-ఢిల్లీ నమో భారత్ రైలు కారిడార్ 82 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. సాహిబాబాద్, ఘజియాబాద్, మోడీ నగర్, మీటర్ వంటి ప్రాంతాలను ఢిల్లీలో ఇది కలుపుతుంది. దీని వల్ల ప్రయాణ సమయం గంట పాటు తగ్గుతుంది.  ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం నేడు ఒక కొత్త విప్లవం వచ్చింది. ఒకే వేదిక నుండి నమో భారత్ ర్యాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ ఒకే రోజున ప్రారంభించబడ్డాయి. వీటిని జాతికి అంకితం చేస్తున్నా. వికసిత్ భారత్ లక్ష్యం వైపు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది” అని పేర్కొన్నారు.

Follow Us