
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 22వ విడత నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 13న అస్సాం రాజధాని గౌహతి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీన్ని వల్ల దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల 23 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.18,640 కోట్లు జమ కానున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. డేటా సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అందుతాయి
పేద రైతులకు ఆర్థిక ఆసరా అందించే లక్ష్యంతో2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి రూ.6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 మూడు విడతల్లో ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన 21 విడతల్లో భాగంగా మొత్తం రూ..4.09 లక్షల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలకు బదిలీ చేయడం విశేషం. గత 21వ విడత నిధులు నవంబర్ 19న కోయంబత్తూరులో విడుదల చేశారు.