
కేంద్ర ప్రభుత్వం జూన్‌లో 23వ విడత పీఎం కిసాన్ నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. లబ్దిదారుల అకౌంట్లో ఇప్పటికే ఇవి జమ అవ్వగా.. ఆ సొమ్మును బ్యాంక్ నుంచి విత్ డ్రా కూడా చేసుకున్నారు. అయితే 24వ విడత డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. నవంబర్-డిసెంబర్ మధ్య తర్వాతి విడత నగదు రైతుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించగా.. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. దీంతో రైతులు ఎప్పటిలాగే ప్రయోజనం పొందనున్నారు. అయితే 24వ విడత నగదు పొందాలంటే ఖచ్చితంగా మూడు పనులు పూర్తి చేయాలని కేంద్రం చెబుతోంది.
24వ విడత పీఎం కిసాన్ నగదును ఎలాంటి సమస్యలు లేకుండా పొందాలంటే ముఖ్యంగా మూడు పనులు పూర్తి చేయాలి. అందులో ఒకటి ఈకేవైసీ పూర్తి చేయడం. పీఎం కిసాన్ కింద లబ్ది పొందాలంటే క్రమం తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నిజమైన లబ్దిదారులకు సహాయం అందుతుందా..? లేదా? అనేది గుర్తించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ పథకంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకుండా పారదర్శకంగా అమలు చేసేందుకు కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. లబ్దిదారులు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు కూడా ఉంది.
ఇక రెండో విషయం చూస్తే.. ప్రభుత్వ పోర్టల్‌లో మీరు పంట సాగు చేస్తున్నట్లు నమోదై ఉండాలి. ఒకవేళ పోర్టల్‌లో పంట సాగు చేయడం లేదని స్టేటస్ కనిపిస్తే పీఎం కిసాన్ సాయం నిలిచిపోవచ్చు. దీంతో మీ పంటను నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎమ్మార్వో లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. డీబీటీ ద్వారా నగదు పొందేందుకు ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి మీరు ఈ మూడు పనులు పూర్తి చేశారా లేదా అనే స్టేటస్ తెలుసుకోవచ్చు.