
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం ముగియడం, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓటమితో భవిష్యత్తులో యుద్దం ఉండదనే వార్త క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. దీంతో అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఇంకా ధరలు తగ్గించకపోవడంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా దేశంలో కేంద్రం తగ్గింపు దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయమంత్రి సురేశ్ గోపి క్లారిటీ ఇచ్చారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని సురేశ్ గోపీ స్పష్టం చేశారు. అది ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికంగా సాధ్యం కాదని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, దీని వల్ల చమురు సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఏకంగా రూ.42 వేల కోట్ల నష్టాలను కంపెనీలు ఎదుర్కున్నాయని చెప్పారు. ఇంధన ధరలను తగ్గించాలంటే ముందుగా ఆయిల్ కంపెనీల ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కర్ణాటక, కేరళలో ధరలు పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించడం వల్ల ధరలు పడిపోతాయని గుర్తు చేశారు. మీనాంబాక్కమ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్రోల్ ధరలు తగ్గించనున్నారనే వార్తలపై స్పందించారు.
పశ్చిమాసియాలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, అవి సవాళ్లుగా మారుతున్నాయని సురేశ్ గోపీ తెలిపారు. రేపటికే రేపే ధరలు తగ్గించాలని మనం కోరుకోవడంలో తప్పు లేదన్న ఆయన.. ఇది సాంకేతికంగా సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ చమురు సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నందున పరిహారం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాగా అమెరికా-ఇరాన్ యుద్దం వల్ల మే నెలలో కేంద్రం నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. వరుసగా నాలుగుసార్లు పెంచడంతో లీటర్‌పై అదనంగా రూ.7.50 మేర పెరిగింది. అంతకముందు 2024లో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 తగ్గించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.116.15గా ఉండగా.. డీజిల్ రూ.104.23 వద్ద కొనసాగుతోంది.