
ప్రముఖ పెట్టుబడిదారుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గురించి అందరికీ తెలిసిందే. ప్రజలకు ఆర్ధిక విషయాల్లో అవగాహన కల్పించేవారిలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎక్కడ పెట్టుబడులు పెడితే మంచిది.? డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రజలకు తాను పాటించే పొదుపు పాఠాలను బోధిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లు, పసిడి ధరల గురించే కాకుండా.. ఆర్ధిక విషయాల పట్ల తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ధనవంతులు పాటించే ట్రిక్స్ ఏంటి? సామాన్యులు సంపన్నులు కావాలంటే ఏం చేయాలి? అనే విషయాలను ది బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ పుస్తకంలో రాబర్ట్ కియోసాకి పొందుపర్చారు.
తాను, తన భార్య ఆర్ధికంగా పొదుపు ఎలా పాటిస్తామనేది తన పుస్తకంలో కియోసాకి వివరించారు. తమకు వచ్చే ప్రతీ డాలర్ ఆదాయంలో 30 శాతం చొప్పున మూడు వేర్వేరు అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం సేవింగ్స్ అకౌంట్లో 10 శాతం, పెట్టుబడుల కోసం మరో అకౌంట్లో 10 శాతం, స్వచ్చంధ సేవ కోసం 10 శాతం మరో ఖాతాలో ఉంచుతామని చెప్పుకొచ్చారు. ధనవంతులు కావాలంటే ఇలా బడ్జెట్ రూపొందించుకోవాలని సూచించారు.
సాధ్యమైనంతంగా అప్పులను ఆస్తులుగా మార్చుకోవాలని కియోసాకి చెబుతున్నారు. దీనికి ఆయన ఒక ఉదాహరణ అందించారు. “నా భార్యకు 60 అడుగుల పడవ కావాలని అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అందుకోసం మేము ఒక చార్టర్ కంపెనీతో పడవను ఎలా అద్దెకు తీసుకోవాలో తెలుసుకున్నాం.. ఆ చార్టర్ల నుండి వచ్చిన ఆదాయంతో పడవ కొనుగోలు చేశాం. దీంతో మాకు అది ఒక ఆస్తిగా కూడా మారింది.ముందుగా డబ్బులు పొదుపు చేసి, ఆ తర్వాత కొనడం కాదు. డబ్బు విషయంలో గెలవడం అంటే ఇదే” అంటూ చెప్పారు.
అప్పుల్లో మంచి అప్పు, చెడు అప్పులు రెండు ఉంటాయని అన్నారు. ఎలాంటి ఆదాయాన్ని అందించని కార్లు, విహారయాత్రలు, వ్యక్తిగత ఖర్చులను చెడు అప్పులుగా చెబుతున్నారు. ఇక పెట్టుడులు, వ్యాపారంలో పెట్టుబడి వంటివి మంచి అప్పులుగా అభివర్ణించారు. ఆస్తులను కొనుగోలు చేయడానికి అప్పును ఉపయోగించడం ద్వారా పెట్టుబడిపై రాబడిని వేగవంతం చేయవచ్చని అంటున్నారు. మీ సొంత డబ్బు తక్కువగా ఉండటం వల్ల ఆస్తి నుంచి నగదు ప్రవాహం కొనసాగుతూనే ఉంటుందని సూచించారు. చెడ్డ అప్పులను త్వరగా తీర్చి మంచి అప్పుల వైపు ఉండాలని చెబుతున్నారు.
ఇక క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలని కూడా కియోసాకి తన పుస్తకంలో రాసుకొచ్చారు. క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోవాలంటే మీ చెడ్డ అప్పులు తగ్గించుకోవాలని, రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. క్రెడిట్ స్కోర్ 700 ఉంటే మంచిదిగా అభివర్ణించిన ఆయన.. 800 కంటే ఎక్కువ ఉంటే అద్బుతమని తెలిపారు. మంచి అప్పుతో ధనవంతులు కావడానికి మార్గం మంచి క్రెడిట్ కలిగి ఉండటమేనని చెప్పారు.