Fixed Deposits: కొత్త ఏడాదిలో బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. తగ్గనున్న రేట్లు..

బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా.. అయితే కొత్త ఏడాదిలో మీకు బ్యాడ్ న్యూస్. 2026లో ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి. దీంతో సేవింగ్స్‌పై రాబడి తక్కువగా రానుంది. ఈ ఏడాది కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గాయి.

Fixed Deposits: కొత్త ఏడాదిలో బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. తగ్గనున్న రేట్లు..
Money Save Tips

Updated on: Dec 31, 2025 | 6:15 PM

2025వ సంవత్సరంలో బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఆర్‌బీఐ ఈ ఏడాది నాలుగుసార్లు రెపో రేట్లను తగ్గించింది. 2025లో 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. దీని వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కొత్తగా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి తక్కువ రాబడి లభించనుంది. అయితే 2026లో ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది.

2026లో మరింతగా తగ్గుతాయా..?

2026లో ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మరింతగా తగ్గే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో స్ధిరంగా లేదా కొంచెం తక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, ద్రవ్య విధానం మరింత అనుకూలంగా మారితే ఎఫ్‌డీ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశంపై అంచనాలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ద్రవ్యోల్బణంలో గణనీయమైన పునరుజ్జీవం లేదా ఊహించని ఆర్ధిక ఒత్తిడి లేనట్లయితే ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో పెరుగుదల అసంభవం అనిపిస్తుందని అంటున్నారు. ఒకవేళ ఎఫ్‌డీ రేట్లు తగ్గితే వాటిల్లో పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోవచ్చని, ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు మొగ్గు చూపవచ్చని అంటున్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌ వైపు మొగ్గు

ఎఫ్‌డీ వడ్డీ రేట్లు తగ్గితే పొదుపు చేసుకునేవారు మ్యూచువల్, డెట్ ఫండ్స్ వైపు మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. సాంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడి ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీ రేట్లపై అనిశ్చిత కొనసాగితే మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగే అవకాశముంది.